ముంపు బాధితులను తక్షణమే ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-10-19T05:56:58+05:30 IST
రోజుల తరబడి వరద ముంపునీటిలో చిక్కుకున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా

-మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి
సర్పవరం జంక్షన్, అక్టోబరు 18: రోజుల తరబడి వరద ముంపునీటిలో చిక్కుకున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం కార్పొరేషన్ 48వ డివిజన్ పార్టీ ఇన్చార్జి కోనాల కృష్ణ ఆధ్వర్యంలో మధురానగర్, ఎస్ అచ్చుతాపురం జనచైతన్యకాలనీలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలు, వరదల కారణంగా ముంపు సమస్య వచ్చిందన్నారు. పలు చోట్ల పంట కాలువలు, నీటి పారుదలశాఖ, డ్రెయిన్లు ఆక్రమణలకు గురవ్వడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేనీరు ముందుకెళ్లే అవకాశం లేక కాలనీలు, గ్రామాలు, పంట పొలాల్లోకి వచ్చి చేరుతుందన్నారు. ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.తిరుమలరావు, ఎస్.శ్రీనివాసరావు, కోన వీరభధ్రరావు, వి.రాంబాబు, ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.
నష్టపరిహారంపై ప్రకటన చేయాలి
అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెద్దిరెడ్డి రవికిరణ్ డిమాండ్ చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు కాళ్ల ధనరాజు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ తమ్మవరంలో ముంపునకు గురైన వరిపొలాలను ఆయన పరిశీలించారు. రైతుల భరోసా కేంద్రాల వద్ద పంట నష్టపరిహారంపై సమావేశాలు ఏర్పాటు చేయాలని రవికిరణ్ కోరారు. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోకుండా ప్రధాని మోదీ ఫసల్ బీమా పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. నాయకులు అనపర్తి వెంకటేష్, చెరియన్, గంగరావు, సత్తిబాబు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.30 వేలు చెల్లించాలి
బిక్కవోలు: భారీ వర్షాలకు వరి పంట నీట మునిగి నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెళ్లూరులో వరి పొలాలను ఆయన పరిశీలించారు. వారంరోజులుగా నీటమునిగి కుళ్లిన వరి పనలను రైతులు ఆయనకు చూపించారు. గ్రామంలో 300 ఎకరాలకుపైగా నీట మునిగి నష్టపోయామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని రామకృష్ణారెడ్డి కోరారు. మండలాధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రెడ్డి శ్రీను, గ్రామశాఖ అధ్యక్షులు బాబులు, గంగరాజు, జానకిరామయ్య, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.