‘పెంచిన పన్నుల భారాన్ని ఉపసంహరించాలి’

ABN , First Publish Date - 2020-12-01T07:03:55+05:30 IST

ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ప్రజలపై ఇంటిపన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు మోపడం అన్యాయమని సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ మూర్తి, నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు విమర్శించారు.

‘పెంచిన పన్నుల భారాన్ని ఉపసంహరించాలి’

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 30 : ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ప్రజలపై ఇంటిపన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు మోపడం అన్యాయమని సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ మూర్తి, నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు విమర్శించారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం నాయకులు మాట్లాడారు. అరుణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్డినెన్స్‌ విడుదలచేసి మున్సిపల్‌ చట్టాలను సవరించిందని, ఈ సవరణ ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి అద్దె విలువ ఆధారంగా కాకుండా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు విధిస్తారని అన్నారు. దీనివల్ల పదిరెట్లు వరకూ ఆస్తిపన్ను పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇదేవిధంగా మంచినీరు, మురుగునీరు నిర్వహణ ఖర్చుమొత్తం ప్రజల నుంచి రాబట్టే విధంగా రెండు జీవోలు విడుదల చేయడం దారుణమన్నారు. రూ.36 కోట్లతో నగరంలో 13 రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని, దీనిలో 2 కిలోమీటర్లు ఉండే ప్రతి రహదారికి రూ.70 నుంచి రూ.90 లక్షలు సుందరీకరణ పేరుతో ఖర్చుపెడుతున్నారన్నారు. ఆర్డినెన్స్‌ 16, జీవోలు 196, 197లను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.



Updated Date - 2020-12-01T07:03:55+05:30 IST