బాదుడే.. పన్ను పెంపునకు సిద్ధమవుతున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు

ABN , First Publish Date - 2020-12-15T07:02:39+05:30 IST

నూతన పన్ను విధానాన్ని అమలులోకి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నించడంతో జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఆస్తుల వివరాల సర్వే జరుగుతోంది.

బాదుడే..   పన్ను పెంపునకు సిద్ధమవుతున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు


  ఆస్తుల వివరాలు సర్వే

  ఇప్పటివరకు చ.మీ. లెక్కన పన్ను విధింపు

  ఇకపై భూమి మార్కెట్‌ విలువ ప్రకారం

  శానసమండలిలో అడ్డుకున్నా ముందుకెళ్లే ప్రయత్నాలు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) నూతన పన్ను విధానాన్ని అమలులోకి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నించడంతో జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఆస్తుల వివరాల సర్వే జరుగుతోంది. ప్రతీ ఆస్తినీ కొలవడంలేదు. కానీ ర్యాండమ్‌గా చెక్‌ చేసి అంచనాలు వేస్తున్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌, పెద్దాపురం, అమలాపురం మునిసిపాలిటీలు మినహా మిగతా అన్నిచోట్లా ఆస్తులను ఇప్పటికే లెక్కకట్టారు. ఇప్పటివరకు చదరపు మీటరు స్థలానికి అద్దె కట్టి దాని ఆధారంగా పన్ను విధించి, వసూళ్లు చేసేవారు. కొత్త విధానంలో భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. 2009 నుంచి భూమి విలువను విపరీతంగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిజిస్ట్రేషన్‌ విలువ పెంచారు. ఈ నేపథ్యంలో పన్నులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో  వైసీపీ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన బిల్లులను టీడీపీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. కానీ అఽధికార పక్షం ఆమోదించింది. శాసన మండలిలో మాత్రం ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండడంతో అడ్డుకున్నారు. ఈ విధానాన్ని ఏదో ఒక విధంగా అమలులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో ఆర్నెల్లకు రూ.104.79 కోట్లు పన్ను వసూలు చేస్తున్నారు. అంటే పట్టణ ప్రజలు ఏడాదికి రూ.209 కోట్లు పన్ను కడుతున్నారు. కొత్త           విధానం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.


రికార్డింగ్‌కు  2,52,307 ఆస్తుల ప్రతిపాదన


 జిల్లాలో రాజమహేంద్రవరం,  కాకినాడ  కార్పొరేషన్లు,  పెద్దాపురం, అమలాపురం, మండపేట, పిఠాపురం, రామచంద్రపురం, సామర్లకోట, తుని మునిసిలిటీలు, గొల్లప్రోలు, ఏలే శ్వరం, ముమ్మిడివరం, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 2,52,307 ఆస్తులను రికార్డు చేయడానికి ప్రతిపాదించగా ఇంత వరకు 2,44,382 ఆస్తులు రికార్డు చేశారు. రాజమహేంద్రవరంలో  రెసిడెన్షియల్‌ ఆస్తులు 64,229, నాన్‌ రెసిడెన్షియల్‌ 6,998.. మొత్తం 71,227 ఉన్నాయి. వాటిలో 64,705 రికార్డు చేశారు.  కాకినాడలో 70,943 రెసిడెన్షియల్‌, 8,464 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 79,407 ఆస్తులు ఉండగా అన్నీ రికార్డు చేశారు. పెద్దాపురంలో 10,150 రెసిడెన్షియల్‌, 910 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 11,060 ఆస్తులున్నాయి. ఇందులో 9,820 రికార్డు చేశారు. అమలాపురంలో  11,355 రెసిడెన్షియల్‌, 1,856 నాన్‌ రెసిడెన్షియల్‌.... మొత్తం 13,211 ఆస్తులకు గాను ఇప్పటి వరకు 13,048 రికార్డు చేశారు. గొల్లప్రోలులో  4,990 రెసిడెన్షియల్‌, 266 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 5,256 ఉండగా మొత్తం రికార్డు చేశారు.  మండపేటలో 10,380 రెసిడెన్షియల్‌, 1095 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం  11,475 ఆస్తులు ఉన్నాయి. వీటిని ఇప్పటికే రికార్డు చేశారు. ముమ్మిడివరంలో  6,000 రెసిడెన్షియల్‌, 564 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 6,564 ఆస్తులు ఉండగా రికార్డు పూర్తయ్యింది. పిఠాపురంలో  10,782 రెసిడెన్షియల్‌, 2,360 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 13,142 ఆస్తులు వున్నాయి. అవన్నీ ఇప్పటికే రికార్డు చేశారు. రామచంద్రపురంలో 9,877 రెసిడెన్షియల్‌, 1,310 నాన్‌ రెసిడెన్షియల్‌.... మొత్తం 11,187 ఆస్తులకు గాను అన్నీ రికార్డయ్యాయి.  సామర్లకోటలో 12,532 రెసిడెన్షియల్‌, 656   నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 13,188 ఆస్తులుంగా అన్నిటినీ రికార్డు చేశారు. తునిలో 9856 రెసిడెన్షియల్‌, 730 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 10,586 ఆస్తులున్నాయి. అవన్నీ రికార్డయ్యాయి.  ఏలేశ్వరంలో  5,373 రెసిడెన్షియల్‌,  631 నాన్‌ రెసిడెన్షియల్‌... మొత్తం 6,004 ఆస్తులు ఉన్నాయి. వీటి రికార్డు పూర్తయ్యింది.




Updated Date - 2020-12-15T07:02:39+05:30 IST