వెంకన్న మెట్లపై రక్త సిందూరం

ABN , First Publish Date - 2020-10-31T06:59:45+05:30 IST

గోకవరం మండలం తంటికొండ శ్రీవెంకటేశ్వస్వామి కొండపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం పెళ్లికి వచ్చిన కుటుంబాల్లో చీకట్లను నింపింది. వివాహం పూర్తి చేసుకొని కొండపై ఘాట్‌ రోడ్డు నుంచి కిందకు దిగే ప్రయత్నంలో వ్యాన బోల్తా పడడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్సపొందుతూ మరో ఇద్దరు.. మొత్తం ఏడుగురు మరణించారు.

వెంకన్న మెట్లపై రక్త సిందూరం

తంటికొండ వెంకన్న ఘాట్‌   రోడ్డులో ఘోరం
పార్కింగ్‌ ప్లేస్‌ నుంచి మెట్ల  మార్గంపైకి వ్యాన్‌ బోల్తా
పెళ్లికి వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం
అక్కడికక్కడే ఐదుగురు.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి
మరో పది మందికి తీవ్ర గాయాలు
రాజమహేంద్రవరం, కాకినాడ ఆసుపత్రులకు తరలింపు
మృతుల్లో దివాన్‌చెరువుకు చెందిన తల్లీకూతురు
కన్నీటి సంద్రమైన బంధువర్గాలు
డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగోకవరం, అక్టోబరు 30: గోకవరం మండలం తంటికొండ శ్రీవెంకటేశ్వస్వామి కొండపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం పెళ్లికి వచ్చిన కుటుంబాల్లో చీకట్లను నింపింది. వివాహం పూర్తి చేసుకొని కొండపై ఘాట్‌ రోడ్డు నుంచి కిందకు దిగే ప్రయత్నంలో వ్యాన బోల్తా పడడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్సపొందుతూ మరో ఇద్దరు.. మొత్తం ఏడుగురు మరణించారు. ఈ వ్యాన్‌లో 17 మంది ప్రయాణిస్తుండగా, మిగిలిన పది మంది క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రాజమ హేంద్రవరం అర్బన జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కోరుకొండ సీఐ పవనకుమార్‌రెడ్డి, గోకవరం ఎస్‌ఐ టి చెన్నారావు నుంచి ఆమె ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే ఆలయ ఈవో కృష్ణారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన బదిరెడ్డి రెడ్డియ్య, పెద్దాడ వెంకన్నదొర, బదిరెడ్డి బాబి, దొడ్డి నాగేశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు.


రక్షణగోడ లేకపోవడం వల్లే..
తంటికొండ వెంకన్న దేవస్థానికి చెందిన ఘాట్‌ రోడ్డుకు ఎటువంటి రక్షణ గోడ నిర్మాణం జరగలేదు. సుమారు కిలో మీటరు మేర ఘాట్‌ రోడ్డును నిర్మించినప్పటికీ భక్తుల వాహ నాలను ప్రమాదాల నుంచి తప్పించేందుకు రక్షణగోడ ఏర్పా టు చేయలేదు. ఇక్కడ రక్షణ గోడ ఉండి ఉంటే ప్రమాదానికి కారణమైన వ్యాన దాన్ని ఢీకొని నిలిచిపోయేది. ప్రమాద తీవ్రత కూడా స్వల్పంగా ఉండేదని భక్తులు చెబుతున్నారు.


ఠాకూరుపాలెంలో విషాదఛాయలు
కొండపై ప్రమాదంతో ఠాకూరుపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. గత పది రోజుల నుంచి వివాహ ఏర్పాట్లతో హడావుడిగా కనిపించిన పెళ్లి కుమారుడి ఇంటి వద్ద బంధు వులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివాహం ముగిసిన గంట వ్యవధిలో ఈ విషాదం కన్నీటి సంద్రంలో ముంచింది.


పెళ్లికుమార్తె ఇంట విషాదఛాయలు
రాజానగరం, అక్టోబరు 30: తంటికొండ ఆలయం వద్ద ప్రమాదంతో రాజానగరం మండలం పాత వెలుగుబందలోని పెళ్లికుమార్తె ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ప్రగడ కాపు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు గురువారం రాత్రి తంటికొండలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో వివాహం జరిపిం చారు. తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర ప్రమాదంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.


తల్లీకుమార్తె కనుమరుగైపోయారు..
దివానచెరువు, అక్టోబరు 30: వ్యానులో క్షేమంగా ఇంటికి చేరుకుంటారనుకుంటే కళ్ల ముందే కనుమరుగైపోయారంటూ రోదిస్తున్న దివానచెరువుకు చెందిన యాళ్ల సతీష్‌కుమార్‌ని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. తంటికొండ ప్రమాదం లో దివానచెరువు గ్రామానికి చెందిన సతీష్‌కుమార్‌ భార్య నాగశ్రీలక్ష్మి (34), కుమార్తె దివ్యశివ గాయత్రి (12) మృతి చెందడంతో విషాదఛాయలు నెలకొన్నాయి. గాయత్రి స్థాని కంగా ఒక ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తాపీమేస్త్రీగా కుటుంబాన్ని పోషిస్తున్న సతీష్‌కుమార్‌ కుమా రుడు అనిల్‌ను గుండెలకు హత్తుకుని రోదిస్తున్నాడు.


మామయ్య పెళ్లికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
కోరుకొండ, అక్టోబరు 30: గాదరాడకు చెందిన చాగంటి పద్మరాజు, అతని భార్య సుజాత, కుమార్తె హేమలతశ్రీ, కుమారుడు ప్రసాద్‌ వారం కిందట బావమరిది పెళ్లికి ఠాకూరుపాలెం వెళ్లారు. పెళ్లి అనంతరం వ్యానులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో హేమలతశ్రీ (14) ప్రాణాలు కోల్పోయింది. తల్లి సుజాత ప్రాణాపాయ స్థితిలో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముందుగా దూకేయడం వల్ల లతశ్రీ సోదరుడు ప్రసాద్‌ (12) బయటపడ్డాడు. తండ్రి వేరే వాహనంలో ఉండడం వల్ల సురక్షితంగానే ఉన్నాడు. సుజాత తోటికోడలు నూకరత్నం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. దీంతో గాదరాడలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీలత మృతదేహాన్ని గాదరాడ తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా పద్మరాజు కుటుంబాన్ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతోపాటు గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ, యర్రంశెట్టి పోలారావు, చిక్కిరెడ్డి సురేష్‌, తోరాటి శ్రీను ఓదార్చారు.


ప్రభుత్వాసుపత్రి వద్ద విషాద వాతావరణం
రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 30: తంటికొండ దుర్ఘటనలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శుక్రవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. కంబాల భాను (గోకవరం), సింహాద్రి ప్రసాద్‌ (ఠాకూర్‌పాలెం), యాళ్ల నాగశ్రీలక్ష్మి, యాళ్ల దివ్య శివగాయత్రి (దివాన్‌చెరువు), వ్యాన్‌ డ్రైవర్‌ పచ్చకూరి నరసింహదొర (గంగంపాలెం) మృతదేహాలను ఉదయం ఆరు గంటల సమయంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. తీవ్ర గాయాలతో బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పశ్చిమగోదావరి జిల్లా ఉంగు టూరు మండలం తల్లాపురానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (70), సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాదరాడకు చెందిన హేమశ్రీలత (13) మృతి చెందారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, టీడీపీ నేత జ్యోతుల నవీన్‌, సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ సంతోష్‌ పర్యవేక్షణలో పోలీసులు విధులు నిర్వ ర్తించారు. ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమసుందరరావు, ఆర్‌ఎంవో ఆనంద్‌ దగ్గరుండి మృతదేహాలకు పోస్టుమార్టం త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. కాగా ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.


పురాతన ఆలయం వద్ద తొలి ప్రమాదం
సీసీ కెమేరాల్లో ప్రమాద దృశ్యాలు..

డ్రైవర్‌ అజాగ్రత్తే కారణం..

హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవచ్చని అనుమానంరాజమహేంద్రవరం, అక్టోబరు30 (ఆంధ్రజ్యోతి) : తంటికొండ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అతిపురాతనమైంది. 1961లో దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడకు భక్తులు అధికంగా వస్తుంటారు. పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. సుమారు కిలోమీటరు ఎత్తులో కొండ ఉంది. అక్కడే దేవుడు గుడి ఉంది. అక్కడ సుమారు 40 వాహనాలు పట్టే పార్కింగ్‌ స్థలం ఉంది. ఇక్కడకు ఎక్కువగా కార్లు వస్తాయి. టాటాఏస్‌ వంటివి అప్పుడప్పుడు వస్తాయి. కొంతమంది మెట్లెక్కి వస్తారు. ఇక్కడ ఆరు సీసీ కెమేరాలు కూడా ఏర్పాటు చేసిన ఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. ఇక్కడ ప్రమాద దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి.  డ్రైవర్‌ వ్యాన్‌పైన లగేజీ పెడుతున్నప్పుడు వ్యాన్‌ కదలడం, మెల్లగా రోడ్డును దాటుకుని కిందకు పడిపోవడం కనిపించాయి. డ్రైవర్‌ హ్యాండ్‌ బ్రేక్‌ వేసి ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏటవాలుగా రోడ్డు ఉండడంతో బరువుకు జారిపోయిందని చెబుతున్నారు. బుధవారం రాత్రి ప్రమాదానికి గురైన బంధువుల వివాహం ఒకటే జరిగింది. పెళ్లికొడుకు, కూతురు, వారికి చెందిన కొందరు ఒక కారులో వచ్చారు. సుమారు 17మంది టాటాఏస్‌లో వచ్చారు. కరోనా వల్ల 100 మందికి మించకుండా పెళ్లికి హాజరు కావచ్చని గోకవరం తహశీల్దార్‌ నుంచి పర్మిషన్‌ తెచ్చుకున్నారు. కానీ వాహనంలో వచ్చిన బంధువులు తక్కువ మందే. 11.17 నిమిషాలకు వివాహం ముహూర్తం.  అర్ధరాత్రి 2 గంటలకు పూర్తయింది. 2.46 గంటలకు ప్రమాదం.


క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: 
జీజీహెచ్‌(కాకినాడ), అక్టోబరు 30: తంటికొండ గ్రామం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్‌, ఇతర అధికార యంత్రాగం అప్రమత్తమై గాయపడిన వారిని వెంటనే జీజీహెచ్‌కు తరలించడం జరిగిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి వైఎస్‌ఆర్‌ ప్రమాద బీమా ద్వారా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్‌ఓంవో డాక్టర్‌ గిరిధర్‌, డాక్టర్‌ రాజేశ్వరి పాల్గొన్నారు. 

Read more