సర్వే సాగేనా..
ABN , First Publish Date - 2020-12-01T07:17:06+05:30 IST
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వే 1920లో జరిగింది. దీని ప్రకారమే భూక్రయవిక్రయ లావాదేవీలు ఇప్పటికీ జరుగుతున్నాయి.

జనవరి 1 నుంచి జిల్లాలో సమగ్ర భూసర్వే
ఆయా భూముల సర్వే నెంబర్లకు అదనంగా సబ్‌డివిజన్ల కేటాయింపు
ఒక సర్వే నెంబర్ పరిధిలోని ప్రతి యజమానికీ ఇకపై కొత్త భూసంఖ్య జారీ
జిల్లాలోని ఒక్కో మండలానికి మూడో వంతు గ్రామాల్లో తొలి దశ కింద సర్వే
జిల్లావ్యాప్తంగా 85 లక్షల రాళ్లు అవసరం అవుతాయని అంచనా
వందేళ్ల తర్వాత చేపడుతున్న సర్వేకు ఎన్నో చిక్కులు, సవాళ్లు
జిల్లాలో భూముల సమగ్ర సర్వేకు రంగం సిద్ధమవుతోంది. వందేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రతి భూమిని సర్వే చేయడానికి సర్వేశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ,ప్రైవేటు భూమి ఏదైనా సరే ఒకే సర్వే నెంబర్.. అందులో ఎంతమందికైనా భూములు ఉండొచ్చు. కానీ ఒకే సర్వే నెంబర్‌పై లావాదేవీలు జరుగుతున్నాయి. దీనివల్ల ఎన్నో వివాదాలు.. చిక్కులు. అయితే ఇకపై సమగ్ర సర్వేలో భాగంగా అన్ని సర్వే నెంబర్లకు సబ్ డివిజన్లను కేటాయించి ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. అంటే వ్యవసాయ, వ్యవసాయేతర భూమి ఉన్న ఎవరికైనా ఇకపై సొంతంగా ఒక సంఖ్య కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ కోసం జిల్లావ్యాప్తంగా 85 లక్షల సర్వేరాళ్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. మూడేళ్లపాటు ఈ సర్వే సాగనుంది.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
సజావుగా సాగేనా...
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వే 1920లో జరిగింది. దీని ప్రకారమే భూక్రయవిక్రయ లావాదేవీలు ఇప్పటికీ జరుగుతున్నాయి. వాస్తవానికి 1920లో జరిగిన భూసర్వే 30 ఏళ్లపాటు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ భూ రీసర్వే జరగాలి. కానీ అనేక కారణాలతో ఇప్పటివరకు సర్వే జరగలేదు. దీంతో ప్రభుత్వ,ప్రైవేటు భూమి ఏదైనా సరే వివాదం తలెత్తితే 1920 నాటి రీసర్వే రిజిస్టర్ (ఆర్‌ఎస్ ఆర్) మాత్రమే రెవెన్యూ శాఖకు ప్రామాణికం. అయితే ఈ వందేళ్లలో అనేక భూములు వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూములుగాను, వాణిజ్య ప్రాంతాలుగాను మారిపోయా యి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఇంకా అవి మార్పులు చోటుచేసుకోకుండా వందేళ్ల కిందట అప్పటి స్థితిగతుల ప్రకారమే కొనసాగుతున్నాయి. అటు ఎక్కడైనా వందెకరాల భూమి ఉంటే దానికి ఏక మొత్తంగా ఒకే సర్వే నెంబర్ కొనసాగుతోంది. ఈ సర్వే నెంబర్ పరిధిలో యాభై, అరవై మందికి సొంతంగా చిన్నచిన్న ముక్కలుగా భూమి ఉంటుంది. వీరు క్రయవిక్రయాలు జరిపితే ఒకే సర్వే నెంబరే అందరికీ ప్రామాణికం. దీనివల్ల అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వందేళ్ల తర్వాత ఇప్పుడు సర్వేశాఖ సమగ్రభూసర్వే చేయడానికి కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రతి మండలంలోని మొత్తం గ్రామాల్లోని మూడోవంతు గ్రామాల్లో తొలిదశ కింద ఈ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం కార్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఒక్కో సర్వే నెంబర్‌లో ఎంతమందికి భూములున్నాయనేది గుర్తించి ఆ సర్వే నెంబర్‌లో ఉన్న వారందరికి కొత్తగా సబ్‌డివిజన్ చేయనుంది. అంటే మూడేళ్ల తర్వాత ప్రతి ఒక్కరికి ఉమ్మడిగా ఇంతకాలంగా ఉన్న సర్వే నెంబర్ స్థానంలో సబ్‌డివిజన్ సర్వే నెంబర్ కొత్తగా కేటాయించనున్నారు. ఇందుకోసం సబ్‌డివిజన్ల వారీగా సరిహద్దు రాళ్లను సర్వేశాఖ పాతనుంది. ఈ మేరకు ఒక్కో మండలానికి ఎన్ని రాళ్లు అవసరం అవుతాయనేదానిపై అధ్యయనం చేసింది. గ్రామీణప్రాంతాల్లో ఒక్క మండలానికి కనీసం లక్ష రాళ్లు, పట్టణాలు, నగరాల్లో రెండు నుంచి రెండున్నర లక్షల రాళ్ల వరకు పాతాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఇందుకయ్యే ఖర్చు ను సర్వేశాఖ భరించనుంది. ఆ తర్వాత తొలిదశ సర్వే పూర్తయిన తర్వాత ఆయా యజమానుల వివరాలతో సబ్‌డివిజన్ సంఖ్యల ప్రకారం టైటిల్ రిజిస్టర్ తయారుచేసి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏడాదిపాటు దీన్ని అమలు చేస్తారు. ఇదిలాఉంటే మండల సర్వేయర్ల ఆధ్వర్యంలో ఎంపికచేసిన గ్రామంలో గ్రామసర్వేయర్, వీఆర్వో కలిపి ప్రత్యేక బృందంగా భూముల సర్వే ప్రక్రియ చేపడతారు. డ్రోన్లతోను, ప్రత్యక్షంగాను రెండు విధాలా సర్వే చేపట్టి వివరాలు క్రోడీకరించి తుది జాబితా సిద్ధం చేస్తారు. దీంతో రెవెన్యూ భూరికార్డుల శుద్ధీకరణ జరిగి ప్రస్తుత యజమానులు, అనుభవదారుల పేర్లు అన్నీ కొత్తగా రికార్డుల్లోకి ఎక్కనున్నాయి. ఈ మొత్తం ప్రక్రియకు జిల్లాకు రూ.8 కోట్ల వరకు నిధులు సర్వేశాఖకు అందనున్నాయి.