అంతర్వేది ఘటన నేపథ్యంలో.. నిఘా నేత్రం
ABN , First Publish Date - 2020-09-14T10:07:29+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామివార్ల ఉత్సవాల సమయంలో..
అంతర్వేది ఘటన నేపథ్యంలో రథాల భద్రతపై పోలీసు, దేవదాయ శాఖ దృష్టి సారింపు
వాడపల్లి రథానికి తాత్కాలిక రక్షణ చర్యలు తొలగింపు
డీజీపీ ఆదేశాలతో ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామివార్ల ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తుల ఊరేగింపునకు ఉపయోగించే ‘రథాల’ భద్రతపై పోలీసు, దేవదాయ శాఖ అధికారులు ఎట్టకేలకు దృష్టిసారించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు దేవాలయాల్లో ఉన్న రథాలను ప్రత్యేక షెడ్లలో భద్రపరిచారు. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మరికొన్నింటికి ఆలయ బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక రక్షణలో భాగంగా ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అయితే అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన దివ్య రథం ఈ నెల 5వ తేది అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో అగ్నికి ఆహుతైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లోని రథాల భద్రతపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి పెట్టింది. డీజీపీ గౌతమ్‌సవాంగ్ ఆదివారం జిల్లా ఎస్పీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి హిందూ దేవాలయాల్లో రథాలు, ఇతర ఆస్తుల భద్రతతో పాటు ఇతర మతస్తులకు చెందిన చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అంతేగాక ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయాల్సిందిగా సూచించారు. అయితే కోనసీమవ్యాప్తంగా కొన్నిచోట్ల రథాలు భద్రంగా ఉన్నప్పటికీ కొన్నిచోట్ల నిర్లక్ష్యంగానే వదిలేశారు.
ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ దివ్య రథం ఆరుబయట తాత్కాలిక రక్షణ చర్యల నడుమ ఇప్పటివరకు భద్రంగానే ఉంది. అయితే పోలీసుల ఆదేశాలతో స్వామివారి నిలువెత్తు రథానికి ఏర్పాటుచేసిన తాత్కాలిక రక్షణ చర్యలను తొలగించారు. ఆరు బయట చుట్టూ కర్రలు కట్టి టార్పాలిన్లతో ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా చేసిన ఏర్పాట్లను డీజీపీ ఆదేశాలతో ఆదివారం తొలగించారు. అయితే వర్షానికి తడిసి, ఎండకు ఎండిపోయే పరిస్థితుల్లో రథం త్వరగా పాడయ్యే ప్రమాదముందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఇప్పటికే సీసీ కెమెరాలు వున్నాయి. కొత్తపేట మండలం పలివెలలోని ఉమాకొప్పులింగేశ్వరస్వామి ఆలయ రథానికి పక్కా ఏర్పాట్లు చేశారు. రథం కొంచెం కూడా కనిపించకుండా పక్కాగా షెడ్డు, రేకులతో తలుపులను ఏర్పాటుచేసి కెమెరాలు కూడా అమర్చారు.
అమలాపురంలోని శ్రీవేకటేశ్వరస్వామి ఆలయ రథం కూడా పక్కా ఏర్పాట్ల మఽధ్యే ఉంది. షెడ్డు నిర్మించి తలుపులతో సహా భద్రపరిచారు. నిఘా కోసం సీసీ కెమెరాలనూ అమర్చారు. శివకోటిలోని ఉమాశివలింగేశ్వరస్వామి, తాటిపాకలోని విశ్వేశ్వరస్వామి, గూడపల్లిలోని అమ్మవారి ఆలయాల రథాలను భద్రపరిచారు. ఆయా గ్రామాల్లో ఉన్న ఆలయాల రథాలను స్థానికులు భద్రపరిచారు. తాజాగా డీజీపీ ఆదేశాల నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు ఎక్కడ ఆలయాలు ఉన్నాయి అనే అంశంపై దృష్టి సారించారు.
చారిత్రాత్మక రథానికి రక్షణ లేకే..
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య రథాన్ని భద్రపరచడంలో చిన్న చిన్న ఆలయాలు తీసుకునే రక్షణ చర్యలు కూడా పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రథం కోసం పక్కాగా 40 అడుగుల ఎత్తులో భవనం ఏర్పాటు చేసినప్పటికీ దానిని భద్రపరిచే ముందు భాగంలో కనీసం రేకుల తలుపులు కూడా ఏర్పాటు చేయలేదు. ఆలయ ప్రాంగణంలో ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని దుస్థితిపై సహాయ కమిషనరు హోదాలో ఉన్న వ్యక్తులు స్పందించకపోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ రథం ఆహుతి కావడంపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు భద్రత, నిఘాపరమైన లోపాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రథాల రక్షణకు పరోక్షంగా కారణమైందని భక్తులు చెప్తున్నారు.