మళ్లీ ముంచుకొస్తోంది..

ABN , First Publish Date - 2020-10-07T08:15:57+05:30 IST

లంపకలోవ, ప్రత్తిపాడు గ్రామాల మధ్య ప్రవహించే సుద్దగడ్డ వాగులో మంగళవారం వరద ఉధృతికి ఓ లారీ కొట్టుకుపోయింది...

మళ్లీ ముంచుకొస్తోంది..

ఉధృతంగా సుద్దగడ్డ వాగు 

పది గ్రామాలకు రాకపోకలు బంద్‌ కొట్టుకుపోయిన లారీ 


ప్రత్తిపాడు, అక్టోబరు 6: లంపకలోవ, ప్రత్తిపాడు గ్రామాల మధ్య ప్రవహించే సుద్దగడ్డ వాగులో మంగళవారం వరద ఉధృతికి ఓ లారీ కొట్టుకుపోయింది. ఇటీవల కాలంలో చాలా వాహనాలు ఇలా కొట్టుకుని పోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో సుద్దగడ్డ వాగు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. ప్రత్తిపాడు నుంచి లంపకలోవ వెళ్లేందుకు క్వారీ లారీ డ్రైవర్‌ ప్రయత్నించడంతో వరద ఉధృతికి లారీ కొట్టుకుపోయింది. వరదనీటిలో ఈదుకుంటూ డ్రైవర్‌, క్లీనర్‌ బయటపడ్డారు.


10 గ్రామాలకు రాకపోకలు బంద్‌

సుద్దగడ్డ వాగు భారీ స్థాయిలో ఉప్పొంగుతోంది. దీంతో ప్రత్తిపాడు, లంపకలోవ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లంపకలోవ, పెదశంకర్లపూడి, ప్రత్తిపాడు, ఉత్తరకంచి, రౌతుపాలెం, గోకవరం, పెద్దిపాలెం, వేములపాలెం, ఏజెన్సీకి చెందిన బురదకోట, బాపన్నదార, కె.ముత్తువాడ, మెట్టుచింత, ఉలిగోగుల  గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్తిపాడు హర్షవర్ధన్‌ కళాశాల సమీపంలో సుద్దగడ్డవాగు నుంచి వచ్చిన వరదనీటితో పొలాలు ముంపునకు గురయ్యాయి. 


రైతుల ఆందోళన

గొల్లప్రోలు, అక్టోబరు 6: ఎగువ ప్రాంతాలు నుంచి వచ్చి చేరుతున్న నీటితో సుద్దగడ్డ (కొండ) కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. సుద్దగడ్డ వరదతో ప్రజలు, రైతులు అందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు-తాటిపర్తి పంచాయతీరాజ్‌ రహదారిపై సుమారు రెండున్నర అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లప్రోలు, తాటిపర్తి పరిసర ప్రాంతాల్లో పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. వరి, పత్తి తదితర పంటలు నీట మునిగాయి. 

Read more