ఆత్మ విశ్వాసమే ఆయుధం

ABN , First Publish Date - 2020-03-08T09:09:03+05:30 IST

మహిళలు ఆత్మ విశ్వాసమే ఆయుధంగా లక్ష్యసాధన కోసం ముందుకు సాగాలని కలెక్టర్‌

ఆత్మ విశ్వాసమే ఆయుధం

మహిళల రక్షణకు అనేక చట్టాలు 

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


కాకినాడ (సర్పవరం జంక్షన్‌), మార్చి 7: మహిళలు ఆత్మ విశ్వాసమే ఆయుధంగా లక్ష్యసాధన కోసం ముందుకు సాగాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ జడ్పీ సమావేశహాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం మహిళా, శిశు సంక్షేమ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించి, సమస్యలపై సంఘటితంగా పోరాడాలన్నారు. పురుషుల కంటే మహిళల్లో మానిసిక దృఢత్వం ఎక్కువన్నారు.


అందువల్లే కుటుంబం, ఉద్యోగ బాధ్యతల నుంచి ఎదురయ్యే ఒత్తిడులను అధిగమించి అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. జిల్లాలో వివిధ కీలక ఉద్యోగాల్లో మహిళా అధికారులు పనిచేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతున్నారని ఆయన కొనియాడారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలని తీసుకొచ్చిందని, అయినప్పటికీ మహిళల పట్ల సమాజంలో దురాగతాలు కొనసాగడం దురదృష్టకరమని కలెక్టర్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నామని జేసీ-2 రాజకుమారి చెప్పారు. 


సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్‌.అచ్చుతాపురానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ సత్యవతి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా అధికారులకు కలెక్టర్‌ పండ్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సుఖజీవన్‌బాబు, జడ్పీ సీఈవో ఎం.జ్యోతి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సునీత, డ్వామా పీడీ ఎం.శ్యామల, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వి.సత్యసుశీల, అధికారులు మాధురి, సుగుణకుమారి, సునీత, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T09:09:03+05:30 IST