ఖోఖోలో రాణిస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-02-12T08:41:43+05:30 IST

పట్టుదల, కృషి, తగిన ప్రోత్సాహం ఉంటే ఎక్కడైనా.. ఎప్పుడైనా రాణించవచ్చు అంటున్నారు కిర్లంపూడి క్రీడాకారులు. పల్లెనుంచి పట్టణస్థాయిలో అంచెలంచెలుగా

ఖోఖోలో రాణిస్తున్నారు..!

ఖోఖో క్రీడలో ప్రతిభ కనబరుస్తున్న కిర్లంపూడి క్రీడాకారులు

విశేష కృషితో జాతీయ జట్టుకు ఎంపిక

క్రీడా కోటాలో ఉద్యోగమే లక్ష్యంగా విద్యార్థుల సాధన


కిర్లంపూడి: 

పట్టుదల, కృషి, తగిన ప్రోత్సాహం ఉంటే ఎక్కడైనా.. ఎప్పుడైనా రాణించవచ్చు అంటున్నారు కిర్లంపూడి క్రీడాకారులు. పల్లెనుంచి పట్టణస్థాయిలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో ఈ క్రీడాకారులు రాణిస్తున్నారు. చదువే కాకుండా క్రీడల్లోను ప్రతిభ కనబరిచి దూసుకుపోతున్నారు. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కఠోర శ్రమతో కృషి చేస్తున్నారు. 


కిర్లంపూడి మండలంలోని కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాల్లోని విద్యార్థులు ఖోఖో క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ఉత్తమ ప్రతిభ కనబరిచి గతంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. వారి ఆదర్శంతో ప్రస్తుతం కిర్లంపూడి కొక్కండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండలస్థాయి, జిల్లాస్థాయిలో రాణించి రాష్ట్రస్థాయినుంచి జాతీయస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవలే ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కిర్లంపూడి విద్యార్థులు చదరం గోవిందు, బుద్ద హేమలత విశేష ప్రతిభ కనబర్చి జాతీయజట్టులో స్థానం సంపాదించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అఖిలభారత జాతీయ పాఠశాలల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే అండర్‌-17 బాలబాలికల ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. కేలో ఇండియా ఖోఖో పోటీలు అస్సాంలోని గౌహతి నగరంలో జరిగాయి. ఈ పోటీలకు ఖోఖోకి రాష్ట్రంనుంచి కిర్లంపూడి విద్యార్థి కడగల వరప్రసాద్‌ ఎంపికై విశేష ప్రతిభ కనబరిచాడు.


తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయులు

క్రీడల్లో రాణించాలంటే క్రీడాకారులకు ప్రోత్సాహం ఎంతో అవసరమని వ్యాయామ ఉపాధ్యాయుడు పట్టాభిరామ్‌ అన్నారు. 1998లో కిర్లంపూడిలోనే ఉద్యోగ జీవితం ప్రారంభించి నాటినుంచి నేటివరకు ఎంతోమంది ఖోఖో క్రీడాకారులను తీర్చిదిద్ది తనవంతు కృషిని అందించారు. తాను వేరే స్కూల్‌కి బదిలీ అయినా కిర్లంపూడి స్కూల్‌ విద్యార్థులకు అందుబాటులో ఉండి సలహాలు ఇస్తూ ఖోఖోలో రాణింపునకు కృషి చేస్తానన్నారు. ఆయనతోపాటు వ్యాయామ ఉపాధ్యాయురాలిగా కొలువు సాధించిన వి.సత్యవతి కూడా పట్టాభిరామ్‌ శిష్యురాలే కావడం గమనార్హం. గురువును మరిపిస్తూ క్రీడల్లో మెలకువలను క్రీడాకారులకు నేర్పిస్తూ క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నారు.


ఎస్‌ఐ ఉద్యోగమే లక్ష్యం..చదరం గోవిందు, 9వ తరగతి

ఇప్పటివరకు నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇటీవల ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జాతీయస్థాయిలో ఎంపికయ్యాను. సబ్‌ఇన్స్‌పెక్టర్‌ కావాలన్నదే నా లక్ష్యం.


క్రీడా కోటాలో ఉద్యోగం సాధిస్తా..బుద్దా హేమలత, ఖోఖో క్రీడాకారిణి

క్రీడలపట్ల మక్కువ పెంచుకున్నాను. కష్టంగా కాకుండా ఇష్టంగా ఆడుతున్నాను. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. క్రీడా కోటాలో ఉద్యోగం సాదించడమే నా లక్ష్యం.


జాతీయజట్టులో స్థానమే లక్ష్యం..కడగల వరప్రసాద్‌, జగపతినగరం, పదో తరగతి

ఖోఖోలో భారత్‌ తరపున ఆడడమే లక్ష్యం. ఇటీవల అస్సాంలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో కోచ్‌లతో కలిసి టోర్నమెంటులో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ జట్టుకు ఎంపికయ్యే దిశగా ఆటలో కృషి చేస్తా.

Updated Date - 2020-02-12T08:41:43+05:30 IST