కుట్రతోనే ఎస్సీ, ఎస్టీ కేసు

ABN , First Publish Date - 2020-10-07T08:18:22+05:30 IST

కుట్రతోనే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ చెప్పారు...

కుట్రతోనే ఎస్సీ, ఎస్టీ కేసు

కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ 


జగ్గంపేట, అక్టోబరు 6:  కుట్రతోనే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ చెప్పారు. జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా ఉండగా జగ్గంపేట మెయిన్‌రోడ్‌ విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యాయని, అప్పట్లో సంక్రాంతి నేపథ్యంలో పనులు మొదలెట్టలేదన్నారు. అనంతరం ప్రభుత్వం మారిందని చెప్పారు. జగ్గంపేట మెయిన్‌రోడ్‌ విస్తరణ పనులు ఆరు నెలలుగా సాగుతున్నా ఒక్కసారి కూడా ఆ పక్కకు వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే షాపుల యజమానుల పట్ల అధికారులు, స్థానిక వైసీపీ నాయకుల పక్షపాత వైఖరిని  స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సోమవారం చిరు వ్యాపారుల దుకాణాలను కూలగొట్టారని, ఆ ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళ్లామన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్లు అందుబాటులో లేరని, స్థానిక డీఈకి ఫోన్‌ చేసినా కలవకపోవడంతో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో మాట్లాడానన్నారు. కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడగా వైజాగ్‌లో ఉన్నట్టు చెప్పారని నవీన్‌ తెలిపారు. అయితే తనపై కేసు పెట్టిన జేసీబీ ఆపరేటర్‌ ఎవరో తనకు తెలియదని, రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు బనాయించారని ఆయన అన్నారు. ఉపాధి చేసుకుని జీవించే ఆపరేటర్లను కూడా ఉపయోగించుకుని తమపై కేసులు పెట్టిస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, ప్రశ్నించే వారిని ప్రభుత్వం కేసులతో భయపెడుతోందని నవీన్‌ చెప్పారు. 


తప్పుడు కేసులు పెడితే  మూల్యం చెల్లిస్తారు.. యనమల 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ),అక్టోబరు6: జగ్గంపేట మెయిన్‌రోడ్‌ విస్తరణ పనులలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన జ్యోతుల నవీన్‌పై అక్రమంగా  కేసు బనాయించడం తగదని, ఇటువంటి తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  మెట్ట ప్రాంతంలో ఇలాంటి తప్పుడు కేసులు గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడితే ఉద్యమాలకు దారి తీస్తాయని, అందువల్ల మంచి, చెడులను ఆలోచించి ప్రవర్తించాలన్నారు. తప్పుడు సంప్రదాయాలకు స్వస్తి పలకాలని యనమల సూచించారు. 

Read more