సత్యదేవుడికి కానుకల వర్షం

ABN , First Publish Date - 2020-12-15T06:50:01+05:30 IST

కరోనా కాలంలోనూ సత్యదేవుడికి హుండీల ద్వారా కానుకల వర్షం కురిసింది. మార్చి నెల నుంచి భక్తులు రాకపోవడంతో దేవస్థానం సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

సత్యదేవుడికి కానుకల వర్షం
హుండీల్లో కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది

   నెలరోజులకు రూ.1.85 కోట్ల ఆదాయం 

  అన్ని విభాగాలకు సుమారు రూ.10 కోట్ల 

ఆదాయం ఉండొచ్చని అధికారుల అంచనా

అన్నవరం, డిసెంబరు 14: కరోనా కాలంలోనూ సత్యదేవుడికి హుండీల ద్వారా కానుకల వర్షం కురిసింది. మార్చి నెల నుంచి భక్తులు రాకపోవడంతో దేవస్థానం సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే పరిస్థితులు చేయిదాటుతున్న క్రమంలో కార్తీక మాసం అన్నవరం ఆలయానికి ఊపిరిపోసింది.  కార్తీకమాసంలో భక్తులు సత్యదేవుడికి హుండీల్లో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,85,71,847 నగదు, 33 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి లభించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. వాటితో పాటు 16 యూఎ్‌సఏ డాలర్లు, 135 యుఏఈ డాలర్లు లభించాయి. లెక్కింపును ఈవో త్రినాథరావుతో పాటు చైర్మన్‌ రోహిత్‌ తదితరులు పర్యవేక్షించారు. గతేడాది కార్తీకంలో సుమారు రూ.2.30 కోట్లు ఆదాయం లభించింది. సోమవారంతో కార్తీకమాసం ముగియగా అన్ని విభాగాల ద్వారా సుమారు రూ.10 కోట్లు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఈ వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.


ప్రసాదాల ద్వారా రూ.3.20 కోట్ల ఆదాయం


సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాసంలో ప్రసాదం విక్రయాల ద్వారా రూ.3,20,55,450 ఆదాయం లభించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 21.12 లక్షల గోధుమ రవ్వ ప్రసాదం ప్యాకెట్లను, 24,794 బంగీ ప్రసాదం ప్యాకెట్లను భక్తులు కొనుగోలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-12-15T06:50:01+05:30 IST