‘కోన’నూ కొల్లగొట్టేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-02-12T08:32:21+05:30 IST

జిల్లాలో ఇసుకకు భారీగా డిమాండ్‌ ఉండడంతో కోట్లకు కోట్లు సంపాదిం చేందుకు అధికార పార్టీలోని కొందరు కీలక నేతల అడ్డగోలుగా వ్యవహ రిస్తున్నారు. తమ అనుచరులతో కలిసి చెలరేగిపోతున్నారు. గోదావరి నదిని ఇసుక ర్యాంపుల నుంచి

‘కోన’నూ కొల్లగొట్టేస్తున్నారు!

తీరాన్ని ఆనుకుని ఉన్న భూముల్లో యథేచ్ఛగా సముద్ర ఇసుక తవ్వకాలు

తొండంగి, యు.కొత్తపల్లి మండలాల్లోని వందలాది ఎకరాల్లో దందా

బీచ్‌ రోడ్డులో రాత్రివేళ కాకినాడకు లారీల్లో రవాణా

అక్కడ రహస్య ప్రాంతాల్లో గోదావరి ఇసుకలో కలిపి విక్రయాలు

తెరవెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కాకినాడ)

జిల్లాలో ఇసుకకు భారీగా డిమాండ్‌ ఉండడంతో కోట్లకు కోట్లు సంపాదిం చేందుకు అధికార పార్టీలోని కొందరు కీలక నేతల అడ్డగోలుగా వ్యవహ రిస్తున్నారు. తమ అనుచరులతో కలిసి చెలరేగిపోతున్నారు. గోదావరి నదిని ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే ఏపీఎండీసీని ఆశ్రయించి  ఆర్డర్‌ ఇచ్చుకోవడం, సొంతంగా తవ్వుకునే అవకాశం లేకపోవడంతో అక్రమా ర్జనకు అడ్డదారులు వెదుకుతున్నారు. అందులో భాగంగా నది ఇసుకను పోలి ఉండే కోన భూములపై కన్నేశారు. తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి నుంచి పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని యు.కొత్తపల్లి మండలం వరకు చోడిపల్లిపేట, అంతర్వేదిపేట, దానవాయిపేట, శ్రీరాంపురం  కోనపాపపేట, మూలపేట, రామన్నపాలెం, మాయాపట్నం వరకు శివారు గ్రామాల్లో తీర ప్రాంతాన్ని ఆనుకుని సర్వే నెం.1/1, 2/1ల్లో వేలాది ఎకరాల కోన భూములు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఇసుకతో నిండి ఉంటాయి.


తీరాన్ని ఆనుకుని ఉండడంతో ఇసుక మేటలు సైతం ఈ భూముల్లో భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటిని కొందరు అధికార పార్టీ నేతలు కాసులుగా మార్చుకుంటున్నారు. సముద్రపు ఇసుకతో ఎంచక్కా వ్యాపారం చేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. ఇదేంటి సముద్రం ఇసుకతో వ్యాపారం అనుకుంటున్నారా! నిజమే కోన భూముల్లో తీర ప్రాంతంలో ఇసుకను బొండు ఇసుకగా పిలుస్తారు. ఇది సముద్ర ఇసుకలా కనిపించదు. మెత్తగా ఉండి చూడ్డానికి నదుల్లో దొరికే ఇసుకలాగే ఉంటుంది. ఒక రకంగా దీనిని నకిలీ ఇసుకగా కనిపెట్టడం కష్టం. దీంతో ఇప్పుడు ఈ ఇసుకను రెండు నియోజక వర్గాల పరిధిలోని మండలాల్లో వేలాది ఎకరాల్లో భారీగా తవ్వేస్తున్నారు. ముఖ్యంగా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధి కొత్తపాకలలో విచ్చల విడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. తీరంలోని కోన భూముల్లో పెద్దగా జనసంచారం ఉండనందున ఎక్స్‌కవేటర్లతో 24 గంటలూ ఖాళీ భూముల్లో బొండు ఇసుకను తవ్వుతు న్నారు. అక్కడికక్కడే లారీల్లో లోడింగ్‌ చేస్తున్నారు.


దీని వెనుక ఆ నియోజకవర్గ కీలక నేత ఆశీస్సులు ఉండడంతో ఎంచక్కా కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. కొత్తపాకల పరిధిలో అయితే ఇప్పటికే వందలాది ఎకరాలు గుల్లచేసేశారు. కొన్నిచోట్ల ఏళ్ల తరబడి ఉన్న ఇసుక మేటలను కూడా వదల్లేదు. దీంతో అక్కడ ఇప్పుడు భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఇదే ప్రాంతంలో పేదల అసైన్డ్‌ భూముల్లో అయితే ఇసుక తవ్వకాలు వద్దన్నా సరే ఎకరాకు రూ.15వేల వరకు చేతిలో పెట్టి తమ పని కానిస్తున్నారు. భారీగా జరుగుతున్న ఈ సముద్రపు ఇసుక తవ్వకాలతో ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం మైదానంలా మారి పోయింది. వాస్తవానికి కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సీఆర్‌జెడ్‌) కింద తీరాన్ని ఆనుకుని వందమీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. కానీ అధికార పార్టీ కీలక నేత అండదండలతో ఇవేం పట్టించుకోకుండా అక్రమార్కులు బరితెగించేస్తున్నారు.


గుట్టుచప్పుడు కాకుండా బీచ్‌ రోడ్డు మీదుగా...

తవ్విన సముద్ర ఇసుకను లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తొండంగి మండలం నుంచి బీచ్‌ రోడ్డులో కాకినాడ తరలిస్తున్నారు. ఈ రోడ్డులో పోలీసులు, గనుల శాఖ నిఘా అసలేమాత్రం ఉండదు. ఫలితంగా ఆటంకం లేకుండా ఇసుక రవాణా దర్జాగా సాగిపోతోంది. వాస్తవా నికి బీచ్‌ రోడ్డులో వందల సంఖ్యలో హేచరీలున్నాయి. ఇవి రొయ్యలతో తరచూ రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో కలిసిపోయి ఇసుక లారీలు కూడా కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. గడచిన కొన్ని నెలలుగా ఇదే తంతు.


ముఖ్యంగా రాత్రివేళల్లో లారీలు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఏ ఒక్కరోజూ ఇవి పట్టుబడలేదు. దీంతో బీచ్‌రోడ్డును సముద్రం ఇసుక రవాణాకు అక్రమార్కులు అనువుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఓ ఎమ్మెల్యే అయితే ఈ ఇసుక వ్యాపారంతో ఏ ఇతర ప్రజాప్రతినిధీ పిండనన్ని డబ్బులను నకిలీ ఇసుక వ్యాపారంతో పిండేస్తున్నారు. వాస్తవానికి కొత్తపాకల ప్రాంతంలో భారీగా జరుగుతున్న ఇసుక తవ్వకాల ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పోలీస్‌స్టేషన్‌ ఉంది. నాలుగు కిలోమీటర్ల పరిధిలో తహశీల్దార్‌ కార్యాలయం ఉంది. అయినా సముద్రం ఇసుక తవ్వకాల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం విశేషం. 


రహస్యంగా గోదావరి ఇసుకతో కలిపేసి...

భారీగా తరలిస్తున్న బొండు ఇసుకను కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో సదరు అధికార పార్టీ కీలక నేతలు తమ అనుచరులతో కలిసి డంపింగ్‌ చేయిస్తున్నారు. ఆనక అందరిలాగే గోదావరి ఇసుకను ఏపీఎండీసీ ర్యాంపుల నుంచి తప్పుడు చిరునామాలతో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఇసుకను సముద్రం ఇసుకలో మిక్సింగ్‌ చేస్తున్నారు. రెండు లారీల గోదావరి ఇసుకకు రెండు లారీల బొండు ఇసుక కలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల అది నకిలీ ఇసుక అని ఏమాత్రం గుర్తించలేరు.


బొండు ఇసుక మొత్తగా నది ఇసుకలాగే ఉండడంతో అటు గోదావరి ఇసుకలో సులువుగా కలిసిపోతుంది. చూసేవారికి ఏ చిన్న అనుమానం కూడా రాదు. ఇలా సిద్ధం చేసిన ఇసుకను కాకినాడ నుంచి తాళ్లరేవు వరకు అనేక అపార్ట్‌మెంట్ల నిర్మాణదారుల నుంచి వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం చేసుకునేవారి వరకు ఒప్పందం చేసుకుని అక్రమార్కులు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. దూరం ఆధారంగా రూ.6వేల నుంచి రూ.10వేల వరకు లారీ ఇసుక విక్రయిస్తున్నారు. అటు మిక్సింగ్‌ లేకుండా బొండు ఇసుకను కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో స్థలాలను చదును చేయడానికి, పునాదుల్లో నింపడానికి విక్రయిస్తున్నారు.

Updated Date - 2020-02-12T08:32:21+05:30 IST