ముంపు నుంచి మోక్షం

ABN , First Publish Date - 2020-11-19T06:44:08+05:30 IST

చారిత్రక రాజమహేంద్రవరంలో ముంపు సమస్యకు మోక్షం కలగనుంది. నగరాన్ని వాన నీటి ముంపు నుంచి తప్పించడానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.82 కోట్లతో అమృత్‌ పథకం కింద స్టారమ్‌ వాటర్‌ డ్రైనేజీ పథకం చేపట్టింది.

ముంపు నుంచి మోక్షం
మోరంపూడి జంక్షన్‌లో నిర్మిస్తున్న స్టారమ్‌ వాటర్‌ డ్రైన్‌

  రాజమహేంద్రవరంలో రూ.82 కోట్లతో స్టారమ్‌ వాటర్‌ డ్రైనేజీ పథకం

  ఎట్టకేలకు వేగవంతమైన పనులు

  మోరంపూడి రోడ్డులో ట్రాఫిక్‌ మళ్లింపు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) చారిత్రక రాజమహేంద్రవరంలో ముంపు సమస్యకు మోక్షం కలగనుంది. నగరాన్ని వాన నీటి ముంపు నుంచి తప్పించడానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.82 కోట్లతో అమృత్‌ పథకం కింద స్టారమ్‌ వాటర్‌ డ్రైనేజీ పథకం చేపట్టింది. తర్వాత ప్రభుత్వం మారడంతో  కొంతకాలం పనులు మందగించాయి. మొదట్లో ఈ పనులను రద్దు చేస్తారేమోననే ప్రచారం జరిగింది. కానీ చివరకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో పనులు వేగవంతమయ్యాయి. ఈ పథకం కింద సుమారు 22 కిలోమీటర్ల మేర ఏడు ప్రధాన డ్రైన్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అర్బన్‌ ఆఫీసు వెనుక భాగంలోని తారకరామానగర్‌, హైవేలోని సీబీసీఐడీ ఆఫీసు, విద్యుత్‌నగర్‌, మహాలక్ష్మీనగర్‌, వాకర్స్‌ పార్కు, వీఎల్‌ పురం మీదుగా డ్రైన్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం మోరంపూడి జంక్షన్‌, ఎల్‌ఐసీ ఆఫీసు ప్రాంతాల్లో డ్రైన్లు నిర్మిస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ చొరవతో మోరంపూడి కూడలిలో 80 అడుగుల రోడ్డు విస్తరణ కోసం భవనాలను కొంతమేర తొలగించారు. మోరంపూడి ఎగువ భాగం నుంచి జాతీయ రహదారి ఇరువైపులా ఎత్తు కావడంతో అటు నుంచి వచ్చే వాననీరంతా మోరంపూడి కూడలిని ముంచేసేది. ఇటీవల కరోనా సమయంలో ఇక్కడ హైవేలో కొంతభాగం నీటి నిల్వతో మురికిగుంతలా మారిపోయిన సంగతి తెలిసిందే. మోరంపూడి నుంచి ఎల్‌ఐసీ భవనం వరకు రెండువైపులా డ్రైన్లు నిర్మిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి మోరంపూడి వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ మళ్లించారు. ఎల్‌ఐసీ భవనం వద్ద రోడ్డును తవ్వి డ్రైను నిర్మిస్తున్నారు. సుమారు 15-20 రోజుల్లో దీనిని పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. 

జూన్‌ నెలాఖరుకు పూర్తి చేస్తాం: సుధాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ 

స్టారమ్‌ వాటర్‌ డ్రైనేజీ పథకంలో ముఖ్యమైన పనులను జూన్‌ నెలాఖరకు పూర్తి చేస్తాము. కమిషనర్‌ ఆదేశాల మేరకు ముఖ్యమైన పనులను ముందు చేస్తున్నాము. నగరంలో 65 శాతం ముంపునీరు మోరంపూడి, వీఎల్‌ పురం కూడళ్ల మీదుగా వెళ్తోంది. ఈ డ్రైను నిర్మాణంతో సమస్య తగ్గుతుంది. వీఎల్‌ పురంలో ముంపు సమస్య లేదు. మరో 35శాతం వాన నీటిని నల్లా ఛానల్‌ ద్వారా పంపిస్తున్నాము. కంబాలచెరువులో పంపు హౌస్‌ నిర్మాణం పూర్తయ్యింది. ముంపు నీటిని అక్కడి నుంచి తాడితోట మీదుగా ఆవలోకి మళ్లిస్తాము. 


Updated Date - 2020-11-19T06:44:08+05:30 IST