-
-
Home » Andhra Pradesh » East Godavari » right
-
రైట్ రైట్
ABN , First Publish Date - 2020-11-21T06:40:32+05:30 IST
ప్రభుత్వ సంస్థలు, శాఖల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు పెరుగుతున్నాయి. తాజాగా పీటీడీ (పబ్లిక్ ట్రాన్సపోర్టు డిపార్ట్‌మెంట్) కూడా ఆయిల్ వ్యాపారంలోకి దిగింది.

- ‘పెట్రో’ వ్యాపారంలోకి ఆర్టీసీ
- ఈ నెల 12న రంగంపేటలో బంకు ప్రారంభం
- త్వరలో రాజోలు, అనపర్తిల్లో ఏర్పాటుకు సన్నాహాలు
- ఇప్పటికే సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం అర్బన పోలీసు శాఖ ఆధ్వర్యంలో బంకుల నిర్వహణ
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ సంస్థలు, శాఖల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు పెరుగుతున్నాయి. తాజాగా పీటీడీ (పబ్లిక్ ట్రాన్సపోర్టు డిపార్ట్‌మెంట్) కూడా ఆయిల్ వ్యాపారంలోకి దిగింది. ఈ నెల 12న రంగంపేటలో బంకు ప్రారంభించింది. రాజోలు, అనపర్తి ప్రాంతాల్లో కూడా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించి కొన్ని అనుమతులు రావలసి ఉంది. రంగంపేటలో బీపీసీఎల్, రాజోలులో ఐవోసీ, అనపర్తిలో రిలయన్స్ కంపెనీలతో పీటీడీ (గతంలో ఆర్టీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బంకులను ఆ సంస్థకు చెందిన స్థలాల్లోనే ఏర్పాటు చేస్తారు. సుమారు 25 ఏళ్లకు లీజు ఒప్పందం కుదిరింది. పెట్రోలు, డీజిలు ఆయా కంపెనీలు సరఫరా చేస్తాయి. స్థలానికి అద్దె ఉంది. కానీ సిబ్బంది అంతా పీటీడీ ఉద్యోగులే. ఆయా సంస్థల నుంచి పెట్రోలుకు రూ.3, డీజిలుకు రూ.2 కమీషన్ వస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజనల్ మేనేజరు ఆర్వీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంటుందన్నారు. అనుమతులన్నీ వచ్చాక రాజోలు, అనపర్తిలో పెడతామని చెప్పారు. తమ బస్సులకు, ఈ బంకులకు సంబంధం లేదని... ఇవి కేవలం పబ్లిక్ కోసమేనన్నారు. ఆర్టీసీ బస్సులకు ప్రతీ గ్యారేజీలోనూ డీజిలు బంకులు ఉన్నాయన్నారు.
మిగతా ప్రభుత్వ శాఖలు కూడా పెట్రోలు వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు బంకులు నడుస్తున్నాయి. రాజమహేంద్రవరం అర్బన పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాంపేటలో ఓ బంకు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కోటిపల్లి బస్టాండు సమీపంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో రెవెన్యూ అధికారులు ఓ బంకు పెట్టాలని ప్రయత్నించారు. కానీ అప్పటి సబ్ కలెక్టర్ అనుమతించకపోవడంతో ఆగింది. జిల్లాలో సుమారు 450 పెట్రోలు బంకులు ఉన్నాయి. వాహనాల సంఖ్య బాగా పెరగడంతో పెట్రోలు, డీజిలు అవసరాలు బాగా పెరిగాయి. ప్రైవేట్ వ్యక్తులతో పాటు రాజకీయనేతలు కూడా బంకుల నిర్వహణలోకి చాలా కాలం క్రితమే ప్రవేశించారు. అన్ని బంకులూ లాభాలతో నడవడం లేదు. అయినా చాలా మంది కొత్తవి పెడుతూనే ఉన్నారు.