సీఎంగారూ..ఇదండి సంగతి..!
ABN , First Publish Date - 2020-02-08T08:48:52+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు నిర్మిస్తున్న కాలనీ పనులు ఆగిపోయాయి. దేవీపట్నం మండలంలో 44 గ్రామాలకు చెందిన ఆరువేల కుటుంబాలకు

పురోగతి లేని పోలవరం పునరావాసం
అర్బన్ హౌసింగ్ ఇళ్ల సంగతేంటి..
(ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం)
పోలవరం పునరావాసం ఎప్పుడు?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంవల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు నిర్మిస్తున్న కాలనీ పనులు ఆగిపోయాయి. దేవీపట్నం మండలంలో 44 గ్రామాలకు చెందిన ఆరువేల కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల కాలనీల నిర్మాణం చేపట్టారు. గతంలో 2వేలమందికి ఇళ్లు నిర్మించగా ప్రస్తుతం మరో 2751మందికి పునరావాసం కల్పించడానికి రూ.260 కోట్లతో 300 ఎకరాల స్థలంలో 10 కాలనీల నిర్మాణం చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకముందే ఈ కాలనీలు నిర్మించి ప్రజలను తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఈ ప్రాజెక్టువల్ల దేవీపట్నం మండలంలో 44 గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇటీవల వరదల సమయంలోనే మూడు నెలల్లో ఇక్కడి ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఎవరూ వారి ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం హయాంలో పది కాలనీల నిర్మాణం చేపట్టగా ప్రభుత్వం మారిన తర్వాత కాంట్రాక్టర్లకు రూ.40కోట్ల మేర బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆపేశారు.
ఈ ఇళ్ల సంగతేంటి?
రాజమహేంద్రవరం కేంద్రంగా ఏపీ టిడ్‌కో ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో గత ప్రభుత్వం అర్బన్‌హౌసింగ్ నిర్మాణం చేపట్టింది. రూ.7,938కోట్లతో 73,111 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, అమలాపురం, పిఠాపురం, రామచంద్రపురం ప్రాంతాల్లో 28,854 ఇళ్లు మంజూరు కాగా 24,912 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి. వీటికి రూ.2,742 కోట్లు అంచనా వేశారు. జిల్లాలో మూడు ఫేజ్‌ల్లో వీటిని చేపట్టారు. ఎన్నికల తర్వాత ఈ పనులు పూర్తిగా ఆగిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులకు కూడా చెల్లించడం లేదు.
లబ్ధిదారులకు ఇళ్లూ అప్పగించలేదు. జిల్లాలో మొదటి దశలో 19,242ఇళ్లు మంజూరు కాగా 14,472ఇళ్లకు స్థలాన్ని సేకరించారు. రాజమహేంద్రవరంలో 4,200 ఇళ్లకు 3,904 నిర్మాణ పనులు చేపట్టారు. కాకినాడలో 4,608 ఇళ్లకు 3,196 ఇళ్లకు నిర్మాణం చేపట్టారు. మండపేట, పెద్దాపురం, సామర్లకోట, అమలాపురం, పిఠాపురం ప్రాంతాల్లో కొన్ని పూర్తయ్యాయి. రెండోదశలో 7,560 ఇళ్లు మంజూరు కాగా రాజమహేంద్రవరం, మండపేట, పెద్దాపురంల్లో 3,672 ఇళ్లకు 2,212 మాత్రమే నిర్మించారు. బొమ్మూరులో 24 ఎకరాల భూమి లేఅవుట్ వేశారు. ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.