తూర్పున దండయాత్ర

ABN , First Publish Date - 2020-07-19T13:45:13+05:30 IST

జిల్లాలో కొవిడ్ భీకర రూపం దాల్చింది. మహమ్మారి కనివినీ..

తూర్పున దండయాత్ర

- జిల్లాలో శనివారం ఒక్కరోజులో 1,132 నమోదైన పాజిటివ్‌ కేసులు

- జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 6,696 కొవిడ్‌-19 కేసులు

- రాష్ట్రం మొత్తం మీద ఒక జిల్లాలో ఒక్కరోజులో ఇన్ని కేసులు ఇదే తొలిసారి

- ట్రూనాట్‌, ఆర్‌టీపీసీఆర్‌లో 417, ర్యాపిడ్‌ కిట్ల ద్వారా 715 మందికి వైరస్‌ నిర్ధారణ

- అత్యధికంగా కాకినాడనగరంలో 350, కాకినాడ రూరల్‌లో 56, రాజమహేంద్రవరం సిటీ 83, రూరల్‌ 13, పెద్దాపురం 55, రామచంద్రపురం 54, మండపేట 47, సామర్లకోట 41

- అమలాపురం, అంబాజీపేట, బిక్కవోలు, జగ్గంపేటలలో ఒక్కొచోట 14 చొప్పున నిర్ధారణ

- కొవిడ్‌తో రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఎనస్తీషియా విభాగం హెచ్‌వోడీ మృతి

- రికార్డు స్థాయి పాజిటివ్‌లతో జిల్లాలో ఆదివారం కర్ఫ్యూ ప్రకటించిన కలెక్టర్‌

- జిల్లాలో యుద్ధప్రాతిపదికన 126 పీహెచ్‌సీలకు ఆక్సిజన్‌ సదుపాయం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ భీకర రూపం దాల్చింది. మహమ్మారి కనివినీ ఎరుగని రీతిలో తూర్పు గోదావరిపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో శనివారం ఒక్కరోజులోనే 1,132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ప్రభావం మార్చిలో మొదలవగా ఇంతవరకు మన రాష్ట్రంలో ఎక్కడా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవలేదు. కానీ ‘తూర్పు’లో మాత్రం శనివారం నిర్ధారణ అయిన పాజిటివ్‌ల సంఖ్య రాష్ట్రంలో ఒక్కరోజులో అత్యధిక కేసుల రికార్డును తిరగరాసింది. దీంతో జిల్లాలో వైరస్ విలయంపై వైద్యులు, అధికారులు తీవ్ర స్థాయిలో కలవరపడుతున్నారు. పరిస్థితి నానాటికి అదుపు తప్పుతుండడంపై ఆందోళన చెందుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో వందలు, పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన 12మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. 


జిల్లాలో శనివారం నమోదైన 1,132 కొవిడ్‌ కేసుల్లో అత్యధికంగా కాకినాడలో గుర్తించారు. ఇక్కడ దాదాపు 12 డివిజన్లలో కలిపి మొత్తం 350 మందికి వైరస్‌ సోకి నట్టు రిపోర్టులు వెల్లడయ్యాయి. ర్యాపిడ్‌కిట్ల ద్వారా 272 మందికి కొవిడ్‌ నిర్ధారణ కాగా, ఆర్‌టీపీసీఆర్‌, ట్రూనాట్‌ యంత్రాల ద్వారా మిగిలిన కేసులు గుర్తించారు. దీంతో కాకినాడ నగరంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 1125కి చేరింది. అటు 50 డివిజన్లు ఉన్న నగరంలో మొత్తం కంటైన్మెంట్‌ జోన్లు 75 వరకు గుర్తించారు. జిల్లా మొత్తం మీద అత్యధిక కేసులు ఈ నగరంలోనే నమోదవడంతో జనం ఆందో ళన చెందుతున్నారు. ఒకరకంగా వరుసగా వందల్లో రికార్డవుతున్న పాజిటివ్‌ కేసుల తో కాకినాడ నగరం అల్లాడుతోంది.


ఎక్కడ చూసినా రెడ్‌జోన్‌లు, కంటైన్మెంట్‌ ఏరియాలే కనిపిస్తున్నాయి. అటు కాకినాడ రూరల్‌లో శనివారం 96 పాజిటివ్‌ కేసులు నిర్ధారించారు. దీంతో రూరల్‌లో కేసుల సంఖ్య సుమారుగా 500కుపైగా చేరుకున్నాయి. అటు రాజమహేంద్రవరం నగరంలోను పరిస్థితి అదుపుతప్పింది. వందల్లో వైరస్‌ నిర్ధారణ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం నగరంలో 110కిపైగా పాజిటివ్‌ కేసులు గుర్తించారు. ఇక్కడ ఎక్కడికక్కడ రెడ్‌జోన్‌లు పెరిగిపోయాయి. రూరల్‌లో 13 కేసులు గుర్తించారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో వందల్లో నమోదవుతోన్న పాజిటివ్‌ కేసులకు సంబంధించి బాధితుల్లో అసలు వైరస్‌ ఎవరి నుంచి ఎలా వ్యాపించింది? ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ ఎవరు అనేది కూడా గుర్తిం చలేని పరిస్థితి ఏర్పడింది. వందలాది కేసులతో వైరస్‌ లింకులను ఆరా తీయడంలో వైద్యులు, మున్సిపల్‌, పోలీసు శాఖలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి. దీంతో పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలు తెలుసుకుని సంబంధీకులే అప్రమత్తం అవ్వాల్సి వస్తోంది.


ఆ ప్రాంతాల్లో కట్టుతప్పుతోంది...

జిల్లాలో పెద్దాపురం, పిఠాపురం, గండేపల్లి, రామచంద్రపురం, మండపేట తదితర ప్రాంతాల్లో కొవిడ్‌ వైరస్‌ ఒక్కసారిగా జూలువిదిల్చింది. గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతాల్లో తక్కువ కేసులు నిర్ధారణ కాగా, ఇప్పుడు ఏకంగా వందల్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా పెద్దాపురంలో పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఏకంగా 55 మందికి కొవిడ్‌ నిర్ధారించారు. వీరంతా ఇటీవల పాజిటివ్‌ వచ్చిన వారి కాంటాక్ట్స్‌గా గుర్తించారు. అటు రామచం ద్రపురంలో 54 కేసులు తేలాయి. వీరిలో చాలామంది మహిళలే ఉన్నారు.


ఇటీవల నమోదైన పాజిటివ్‌లకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌తోపాటు స్వచ్ఛం దంగా టెస్ట్‌లు చేయించుకున్న వారు ఉన్నారు. రావులపాలెంలో 49 మందికి కొవిడ్‌గా తేలింది. మండపేటలో 47 కేసులు నిర్ధారణ అవ్వగా, సగం మంది స్వచ్ఛందంగా సంజీవిని సంచార టెస్టింగ్‌ వాహనం వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నవారు న్నారు. గండేపల్లిలో 24 మందికి వైరస్‌ తేలింది. ఇటీవల ఓ కుటుంబంలో కొందరికి  పాజిటివ్‌రాగా, వారి కాంటాక్ట్స్‌ వీరంతా. కరపలో 18 కేసులు నిర్ధారణ అయ్యాయి. అమలాపురం, అంబాజీపేట, బిక్కవోలు, జగ్గంపేటలలో 14 కేసుల చొప్పున నమోద య్యాయి. చింతూరు మండలంలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఐటీడీఏ ఆర్‌వోఎఫ్‌ఆర్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులున్నారు. ఎటపాక సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ లో నలుగురు జవాన్లకు పాజిటివ్‌గా తేలింది. దీంతో  ఇక్కడ మొత్తం కొవిడ్‌ బారిన పడ్డ కానిస్టేబుళ్ల సంఖ్య 26కి చేరింది. శంఖవరంలో 9 మందికి  కొవిడ్‌గా తేలింది. ముమ్మిడివరంలో ఓ వీఆర్వోకు, తాళ్లరేవులో ఇద్దరికి పాజిటివ్‌రాగా అందులో ఒకరు గర్బిణీ ఉన్నారు. కాగా జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసులు 6,696కు చేరాయి. 


జీఎస్‌ఎల్‌ వైద్యుడు మృతి...

కొవిడ్‌ మరణాలు జిల్లాలో భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు అయిదు నుంచి ఆరుగురు వరకు వైరస్‌తో మృతి చెందుతున్నారు. రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగం హెచ్‌వోడీగా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రతాప్‌ కొవిడ్‌ బారినపడి శనివారం ఉదయం కన్నుమూశారు. గతంలో ఈయన కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉద్యోగ విమరణ చెందారు. అటు పెదపూడి మండలంలో ఎన్నో ఏళ్ల కింద స్థానికంగా చైతన్య పేరుతో క్లినిక్‌ ఏర్పాటు చేశారు. అటు కాకినాడ జీజీహెచ్‌లో కొవిడ్‌తో మరో ఇద్దరు మృతి చెందారు. వీరిలో కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు, పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన 55 ఏళ్ల మహిళ ఉన్నారు. ఇక మన్యంలో తొలి కరోనా మరణం నమోదైంది.


రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో డయాల్సిస్‌ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న 58 సంవత్సరాల వ్యక్తికి రెండు రోజుల కిందట కరోనాగా నిర్ధారణ అయింది. శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉంటే జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరుగుతుండడం, బాధితులు, పాజిటివ్‌ తేలకుండా అనారోగ్యానికి గురై శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారు అధికంగా ఉంటున్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన జిల్లాలో 126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మరోపక్క జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ఆది వారం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీనివల్ల కేసుల తీవ్రత తగ్గాయా? లేదా? విశ్లేషించి వచ్చే ఆదివారం కర్ఫ్యూ నిర్ణయం అమలుచేయాలా? లేదా? అనేది నిర్ధారించనున్నారు. 

Updated Date - 2020-07-19T13:45:13+05:30 IST