సడన్‌గా గుడ్ల వినియోగం పెరగడం వెనుక అసలు కారణం ఇదన్నమాట..!

ABN , First Publish Date - 2020-04-08T19:21:53+05:30 IST

తూర్పు గోదావరి జిల్లాలో గుడ్డు వినియోగం అమాంతం పెరిగింది. కరోనా ముప్పుతో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అంతకుముందు రోజులతో పోల్చితే ఆతర్వాత దీని వాడకం అధికమైంది. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు 24 లక్షల గుడ్లు వాడకం జరిగేది.

సడన్‌గా గుడ్ల వినియోగం పెరగడం వెనుక అసలు కారణం ఇదన్నమాట..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారీగా పెరిగిన గుడ్డు వినియోగం

అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు 24 లక్షల వాడకం, ఇప్పుడు 30.50 లక్షలపైనే

పెరిగిన కూరగాయలు, నిత్యావసర ధరల నేపథ్యంలో గుడ్డు వైపే జనం మొగ్గు

చికెన్‌ వినియోగం 75 టన్నుల నుంచి 20 టన్నులకు డౌన్‌

ధర పెరగడం, ఉత్పత్తి తగ్గడం, కొనుగోలు సమయాల్లో ఆంక్షలే కారణం

మటన్‌ వినియోగం 82 టన్నుల నుంచి 23 టన్నులకు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ): తూర్పు గోదావరి జిల్లాలో గుడ్డు వినియోగం అమాంతం పెరిగింది. కరోనా ముప్పుతో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అంతకుముందు రోజులతో పోల్చితే ఆతర్వాత దీని వాడకం అధికమైంది. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు 24 లక్షల గుడ్లు వాడకం జరిగేది. ఇదికాస్తా ఇప్పుడు 30.50 లక్షలకు పెరిగింది. గతనెల 23న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో జనం అప్పటి నుంచి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. కేవలం ఉదయం ఆరు నుంచి పది వరకే నిత్యావసరాల కొనుగోలుకు బయటకు రావడానికి అనుమతి.


ఈ సమయంలో నిత్యవసర సరకుల విక్రయ దుకాణాలు మాత్రమే తెరుస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆకుకూరలు ఆకాశాన్నంటాయి. బెండ, బీర, బంగాళాదుంప, వంకాయ, టమోట నుంచి పప్పుల వరకు కిలో రూ.15 నుంచి రూ.45 వరకు పెరిగిపోయాయి. అది కూడా కొందామంటే గంటల తరబడి దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కోసం క్యూకట్టే బదులు సులువుగా తక్కువ ధరకు దొరికే గుడ్డుపైనే జనం మొగ్గు చూపుతున్నారు. 


దీంతో లాక్‌డౌన్‌ తర్వాత కొనుగోళ్లు అనూహ్యంగా పెరిగాయి. వాస్తవానికి కూరగాయలు ఒకేసారి  ఎక్కువ కొంటే నిల్వ చేసే పరిస్థితి లేదు. అలాగని తక్కువ కొంటే వీటికోసం లాక్‌డౌన్‌ సమయంలో చీటికీమాటికీ బయటకు తిరగడం పెద్ద సమస్య. గుడ్డు అయితే ఎక్కువకాలం నిల్వ ఉండే అవకాశం, ఇంట్లో పిల్లలకు సులువుగా వండే వీలుండడం, అటు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బలవర్ధక ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గుడ్డు వాడకం ఎక్కువైందని అనపర్తి పశుసంవర్థకశాఖ ఏడీ ఎం.వెంకటేశ్వరరావు వివరించారు. ఇతర ధరలతో పోల్చితే ప్రస్తుతం గుడ్డు ధర విడిగా రూ.5 పలుకుతుంది. హోల్‌సేల్‌లో 30 గుడ్లట్రే రూ.4 చొప్పున రూ.120కి దొరుకుతున్నాయి. దీంతో జనం వీటినే ఎగబడి కొంటున్నారు. దీంతో ఈనెల 23 తర్వాత నుంచి జిల్లాలో రోజువారీగా గుడ్లు వినియోగం 24లక్షల నుంచి 30.50 లక్షలకు పెరిగింది. అంటే సాధారణ రోజులతో పోల్చితే 6.50 లక్షలు ఎక్కువ. 


చికెన్‌... మటన్‌ నేల చూపులు..

సాధారణ రోజుల్లో జిల్లాలో చికెన్‌ వినియోగం రోజుకు 50 టన్నులు. ఆదివారం 75 టన్నులు. లాక్‌డౌన్‌తో ఈ అమ్మకాలు పడిపోయాయి. ఎక్కడికక్కడ కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం, పౌల్ట్రీలకు దాణా రవాణా నిలిచిపోవడంతో ఉత్పత్తిపై ప్రభావం చూపింది. పౌల్ట్రీ రైతులకు బ్రాయిలర్‌ లైవ్‌ కిలో రూ.65 గిట్టుబాటు అవుతుండగా, వ్యాపారులు రూ.240కి విక్రయిస్తున్నారు. దీంతో ధరలు పెరిగి అమ్మకాలు పడిపోయాయి. చికెన్‌ దుకాణాలు తెరిచే వేళలు కేవలం నాలుగు గంటలే ఉంటున్నాయి. దీంతో దుకాణాల వేళలు వినియోగదారుడికి అందుబాటులో ఉండకపోవడం, లైవ్‌లో చికెన్‌ తీసుకునేవారు అధికం కావడం, అది దొరక్క పోవడంతో  జిల్లావ్యాప్తంగా చికెన్‌ విక్రయాలు రోజుకు 20 టన్నులకు పడిపోయింది. మటన్‌ సాధారణ రోజుల్లో 75 టన్నులు, ఆదివారం 82 టన్నులు ఉంటుంది. లాక్‌డౌన్‌తో వారపు సంతలు ఆగిపోయి మేకలు, గొర్రెల వ్యాపారం నిలిచిపోయింది. తెరిచే దుకాణాలు సగానికి పడిపోయాయి. అటు ధర కిలో రూ.800కి చేరింది. ఫలితంగా మటన్‌ వినియోగం 23 టన్నులకు పడిపోయింది. ఈ పరిస్థితులు కూడా కోడిగుడ్డు అమ్మకాలు పెరగడానికి కారణమైంది.

Updated Date - 2020-04-08T19:21:53+05:30 IST