పేదల బియ్యం పక్కదారి!

ABN , First Publish Date - 2020-11-07T07:34:57+05:30 IST

కరోనా నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదనే సత్సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్‌ అందిస్తున్నాయి. అయితే ఈ రేషన్‌ బియ్యం పక్కదారి పట్టి కొందరికి కాసులు కురిపిస్తోంది. ప్రతీనెలా ఒకటో తేదీన లబ్ధిదారులు రేషన షాపుల నుంచి బియ్యం తీసుకుంటున్నారు.

పేదల బియ్యం పక్కదారి!
రావులపాలెం మండలంలో రేషన దందా

  • రావులపాలెం మండలంలో రేషన దందా
  • లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి దళారులకు అమ్మకం
  • వారు అంతకన్నా అధిక ధరకు పెద్ద మొత్తంలో విక్రయం
  • పెద్దల అండదండలు ఉన్నాయని విమర్శలు
  • చూసీచూడనట్టు  స్థానిక అధికారులు

రావులపాలెం రూరల్‌, నవంబరు 6: కరోనా నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదనే సత్సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్‌ అందిస్తున్నాయి. అయితే ఈ రేషన్‌ బియ్యం పక్కదారి పట్టి కొందరికి కాసులు కురిపిస్తోంది. ప్రతీనెలా ఒకటో తేదీన లబ్ధిదారులు రేషన షాపుల నుంచి బియ్యం తీసుకుంటున్నారు. అయితే ఈ బియ్యం ద్వారా అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ కొందరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని రావులపాలెం శివారు ప్రాంతాల్లో కొందరికి రూ.14కి అమ్మి సొమ్ములు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన వారు ఈ రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసేందుకు రైస్‌మిల్లులకు, చేపలచెరువులకు రూ.16 చొప్పున విక్రయాలు సాగిస్తూ అడ్డూ అదుపూ లేకుండా దందా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే రావులపాలెంలో రేషన్‌ దందాపై విజిలెన్స్‌ అధికారులు సుమారు రెండు నెలల క్రితం ఒకసారి, నిన్న మరోసారి దాడులు చేసి సరుకును సీజ్‌ చేశారు. ఇదే మాదిరిగా మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న రేషన్‌ దందాపై గతంలో కూడా పలుమార్లు దాడులు జరిగాయి. బియ్యాన్ని సీజ్‌ చేసి కేసులు కూడా నమోదు చేశారు. దాడులు చేస్తున్నా రేషన్‌ దందాకు అడ్డుపడట్లేదు. ఈ వ్యవహారం వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అన్న అనుమానాలు  వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఎవరైనా సమాచారమిస్తేనే దాడులు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. స్థానిక అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం వల్లే బియ్యం పక్కదారి పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  జిల్లా అధికారులు జోక్యం చేసుకుని రేషన్‌ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని  కోరుతున్నారు.

Updated Date - 2020-11-07T07:34:57+05:30 IST