చిన్నారిపై అఘాయిత్యం
ABN , First Publish Date - 2020-11-26T06:43:59+05:30 IST
అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. కాకినాడ జగన్నాథపురంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి...

కాకినాడలో ఘటన
కాకినాడ క్రైం, నవంబరు 25: అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. కాకినాడ జగన్నాథపురంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... గోళీలపేటకు చెందిన వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. భార్య కుటుంబ పోషణ కోసం హైదరాబాదులో ఉంటోంది. దీంతో అతడు కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పాపలతో అత్తమామల వద్ద ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి మనుమరాళ్లు ఇద్దరు అమ్మమ్మ, తాతయ్య వద్ద పడుకున్నారు. చిన్నారుల తండ్రి ఆరుబయట పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ అంతా గాఢనిద్రలో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ఐదేళ్ల బాలికను ఎత్తుకుపోయి శ్మశానవాటిక సమీపంలో ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడే వదిలేసి పరారయ్యాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన అమ్మమ్మ, తాతయ్య మనవరాలు కనిపించకపోయే సరికి అల్లుడితో కలిసి గాలించారు. నాలుగు గంటల సమయంలో రంపపు మిల్లు దగ్గర చిన్నారి ఏడుస్తూ తీవ్ర రక్తస్రావంతో ఉండడాన్ని గుర్తించిన స్థానికులు వీరికి అప్పగించారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను జీజీహెచ్‌కు తరలించగా ఎంఎల్‌సీ కేసు అయితేనే గానీ వైద్యం అందించలేమని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ టి.రామ్మోహన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని వైద్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న బాలికను ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.