మూడు ముక్కలాట!

ABN , First Publish Date - 2020-08-12T14:57:36+05:30 IST

రాజోలు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గంలోని అధికార వైసీపీ..

మూడు ముక్కలాట!

రాజోలు నియోజకవర్గ వైసీపీ నాయకత్వానికి మూడు వర్గాల పోరు

నాయకత్వ విభేదాలను బట్టబయలు చేసిన ఎమ్మెల్యే రాపాక

ముగ్గురు నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు

ఇన్‌చార్జి బాధ్యతల కోసమేనా.. జనసేనపై ఎమ్మెల్యే తాజా ఆరోపణలు


అమలాపురం(తూర్పు గోదావరి): రాజోలు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గంలోని అధికార వైసీపీ నాయకుల మధ్య మూడు ముక్కలాట కొనసాగుతోంది. ఆ పార్టీకి మద్దతిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పార్టీ పరిస్థితులపై బహిరంగంగానే ఆరోపణాస్ర్తాలు సంధిస్తున్నారు. తాను జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ ఆ పార్టీ నిలబడేది కాదని, ఇతర కులాల మద్దతు లేదని, తనకున్న వ్యక్తిగత పలుకుబడితోనే రాష్ట్రంలో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచి నిలవగలిగానని చెప్పుకున్నారు.


అయితే ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో అధికార వైసీపీ నాయకత్వంలో కొనసాగుతున్న అంతర్గత పోరును ఎమ్మెల్యే రాపాక బహిర్గతం చేయడం ద్వారా ఆ పార్టీపై పరోక్షంగా అసంతృప్తిని వెళ్లగక్కినట్టయింది. జనసేన నుంచి గెలిచినా వైసీపీతోనే కలిసి నడుస్తున్నప్పటికీ పార్టీ పగ్గాలను ఎవరో ఒకరికి అప్పగించక పోవడం వల్ల నియోజకవర్గంలో పార్టీ బలహీన పడుతుందని ఆవేదన చెందారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాలకార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ వర్గం, ఎన్నికల్లో ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు వర్గంగా కేడర్‌ మూడు ముక్కలయింది. ప్రతి చిన్న కార్యక్రమం సైతం వివాదాస్పద మవుతోంది.


ఇటీవల తాటిపాక మార్కెట్‌ కమిటీ పాలకవర్గ నియామకంలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కమిటీ ప్రమాణ స్వీకారం చేయకముందే దానిని రద్దుచేసి మరో కమిటీని నియమించాలని నియోజకవర్గ ఇన్‌చార్జిగా చెబుతున్న అమ్మాజీ సిఫారసు వెనుక అనేక ఆరోపణలు వినిపించాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలను సర్దుబాటు చేసేందుకు అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల నాని, ఎంపీ చింతా అనురాధ, లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలోని ఇన్‌చార్జి పోరుల కారణంగా చోటుచేసుకుంటున్న పార్టీ పరిస్థితులపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం వెనుక వివాదం తుది పోరుకు వచ్చినట్టు కనిపిస్తోంది.


జనసేనను వదులుకుని వైసీపీ కోసం తహతహలాడుతున్న ఎమ్మెల్యే రాపాకకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలనే కోణంలో ఆయన వర్గీయులు చేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా జనసేనను గాలి పార్టీగా విమర్శిస్తున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలోని వైసీపీ కేడర్‌లో రగులుతున్న అసంతృప్తి రోడ్డెక్కే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.


Updated Date - 2020-08-12T14:57:36+05:30 IST