-
-
Home » Andhra Pradesh » East Godavari » Raja Mahendravaram Rural
-
జిల్లాలో 5 క్వారంటైన్ సెంటర్లు
ABN , First Publish Date - 2020-03-25T09:54:35+05:30 IST
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోనే ఇప్పటివరకు ఒక క్వారంటైన్ సెంటర్ ఉండేది.

కాకినాడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోనే ఇప్పటివరకు ఒక క్వారంటైన్ సెంటర్ ఉండేది. ఈ సెంటర్‌లో ప్రస్తుతం 120 బెడ్‌లు అందు బాటులో ఉంచారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా వైద్యఆరోగ్య శాఖ మరో నాలుగు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా కోనసీమలో దిండి, పుణ్యక్షేత్రమైన అన్నవరం, విలీన మండలమైన ఎటపాక, కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఎన్ని బెడ్‌లు ఏర్పాటు చేస్తారనేది స్పష్టం కావాల్సి ఉంది. మంగళవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసిన కోవిడ్-19 హెల్త్ బులిటెన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 3525 మంది విదేశాల నుంచి వచ్చారు. వారందరినీ అబ్జర్వేషన్‌లో ఉంచారు. తాజా సమాచారం మేరకు వీరందరికీ అనుమానిత లక్షణ పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో 46 మందికి శ్వాబ్ పరీక్షలు చేశారు.
ఒకరికి పాజిటివ్ రాగా, 34 మంది నమూనాలు నెగిటివ్‌గా వచ్చాయి. 11 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన 12 మంది ప్రయాణికులను జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో మెడికల్ ఐసొలేషన్ వార్డులో ఉంచారు. నిపుణుల పర్యవేక్షణలో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ 12 మందిలో కొత్తపేటకు చెందిన ఒక వ్యక్తి ఖత్తర్ నుంచి వచ్చారు. కాకినాడకు చెందిన భార్యాభర్త, ఏడాదిన్నర బాలుడు నెదర్లాండ్ నుంచి వచ్చారు. రాజమహేంద్రవరానికి చెందిన యువకుడికి కాకినాడ జీజీహెచ్‌లో పరిశీలించగా పాజిటివ్ రాగా అతనికి ప్రస్తుతం వైద్యం అందుతోంది. అతని కుటుంబీకులు, పరిసర ప్రాంతాలకు చెందిన 10 మందిని గత నాలుగు రోజులుగా ఇక్కడ ఐసొలేషన్ వార్డులో పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇప్పుడు ఐసొలేషన్ బెడ్‌లు 270కి పెరిగాయి. ఎటువంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కొనేందుకు బెడ్‌ల సంఖ్య పెంచారు. కాకినాడ జీజీహెచ్‌లో 220, రాజమహేంద్రవరం ఏరియా ఆసుపత్రిలో 10, ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 10, రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో 15, అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో 15 వార్డుల్లో బెడ్‌లు సిద్దం చేశారు.