రైతు గుండెల్లో.. ముసురు

ABN , First Publish Date - 2020-11-13T16:38:38+05:30 IST

రైతుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరిగెడుతున్నాయి..

రైతు గుండెల్లో.. ముసురు

కోత దశలో ఉన్న వరి పంట..  అకాల వర్షాలతో హడల్‌

గడిచిన మూడు నెలల్లో వరుసగా వానలే

ఇప్పుడు మళ్లీ వానగండం


కాకినాడ (ఆంధ్రజ్యోతి): రైతుల గుండెల్లో మళ్లీ రైళ్లు పరిగెడుతున్నాయి. వరుసగా అల్పపీడనం, తుపాన్లతో హడలిపోతున్న అన్నదాతలు తాజా ముసురుతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీపావళి ముందు ముసురు పట్టడం కొత్తమీ కాకపోయినా ఈమధ్య కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం పట్టుకుంది. మొన్న కురిసిన వర్షాలకు, వరదకు తీవ్రంగా నష్టపోయిన రైతులు కొంచెం కోలుకుంటున్నారనే సమయానికి గత మూడు రోజుల నుంచి జిల్లాలో చినుకులు, అక్కడక్కడా చిన్నపాటి వర్షం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కోత దశకు చేరుకుంటున్న ఖరీఫ్‌కు ఈ వర్షాల బెడదతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వరిచేలు వంగి, గిం జలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుండడంతో కంగారు మొదలయ్యింది. సీజన్‌లో కొందరు రైతులు ఆలస్యంగా విత్తు జల్లారు. వీరికి కొంతవరకు ఫలితం ఆశాజనకంగా ఉంటుంది.


సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు వేసిన వారి చేలల్లో ఇప్పటికే పంట కోత దశకు వచ్చింది. వీరిలో ఇప్పు డు ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్‌ సాగు చేశారు. ప్రస్తుతం ఇందులో 45 వేల హెక్టార్లలో 20 శాతం మేరకు కోతలు పూర్తయ్యాయి. ఇంకా 80 శాతం చేలోనే పంట ఉంది. ఇప్పుడు ఈ వర్షాల వల్ల చేనుకు దోమపోటు, పొడతెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులూ కంగారు పడుతున్నారు. ఇటీవల కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పంట నష్టాలను అంచనా వేసి వెళ్లింది. ఇంతలోనే మళ్లీ ముసురు పట్టింది.


Updated Date - 2020-11-13T16:38:38+05:30 IST