‘ఎల్‌ఆర్‌ఎస్‌’లో క్రమబద్ధీకరించుకోకపోతే..భవిష్యత్తులో ఇబ్బందే..!

ABN , First Publish Date - 2020-02-12T08:51:40+05:30 IST

నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు, నాన్‌ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)లో క్రమబద్ధీకరించుకోకపోతే భవిష్యత్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోతాయని గుడా వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు.

‘ఎల్‌ఆర్‌ఎస్‌’లో క్రమబద్ధీకరించుకోకపోతే..భవిష్యత్తులో ఇబ్బందే..!

నిలిచిపోనున్న నాన్‌లేఅవుట్‌ ప్లాట్ల కొనుగోళ్లు, అమ్మకాలు

లైసెన్స్‌ సర్వేయర్లు, ప్లానింగ్‌ సెక్రటరీల సమావేశంలో గుడా వైస్‌చైర్మన్‌


కాకినాడ కార్పొరేషన్‌, ఫిబ్రవరి 11: నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లు, నాన్‌ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)లో క్రమబద్ధీకరించుకోకపోతే భవిష్యత్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోతాయని గుడా వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డు శుభం కాపు కల్యాణ మండపంలో మంగళవారం గుడా ఆధ్వర్యంలో జిల్లాలోని లైసెన్స్‌ సర్వేయర్లు, ప్లానింగ్‌ సెక్రటరీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌, రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రంగనాయకులు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రంగరాజు ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.రమేష్‌, గుడా చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రామ్‌కుమార్‌, ఏసీపీలు ఎస్‌కే కాలేషా, రామ్మెహన్‌, ఏపీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ లైసెన్స్‌ సర్వేయర్లు, ప్లానింగ్‌ సెక్రటరీలు మీ పరిధిలో నాన్‌ లే అవుట్‌లను, నాన్‌ లే అవుట్ల  ప్లాట్లను గుర్తించాలన్నారు.


గుర్తించిన వాటిని ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌కోసం ఏర్పాటు చేసిన యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ముందుగా ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌పై అందరూ అవగాహన కలిగి నియమ, నిబంధనలు పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. 2007లో మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ఇచ్చామన్నారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత ప్రభుత్వం జీవో నెంబరు 10 ద్వారా ఇచ్చామన్నారు. అర్బన్‌ డెవలప్‌ అధారిటీస్‌లో ఉన్న గ్రామాలకు మాత్రమే ఈ స్కీమ్‌ వరిస్తుందన్నారు. తిరుపతి, పుట్టపర్తి తప్ప మిగిలిన అథారిటీలన్నిటికీ ఈ జీవో వర్తిస్తుందన్నారు. 2012నుంచి ఎక్కువగా అనాథరైజ్డ్‌ లే అవుట్లు వెలిశాయన్నారు. 


డీడీ రంగనాయకులు మాట్లాడుతూ ఈ స్కీమ్‌ ద్వారా నాన్‌లేఅవుట్లను, ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకోకపోతే భవిష్యత్తులో కొనుగోళ్లు, అమ్మకాలు, నిర్మాణాలు జరగకుండా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఏడీ రంగరాజు మాట్లాడుతూ 2019, ఆగస్టు 31 ముందు లే అవుట్లు, ప్లాట్లు మాత్రమే ఈ పథకానికి వర్తిస్తుందన్నారు. వీటికి నిర్ణీత అపరాధ రుసుము 14శాతం ఓపెన్‌ స్పేస్‌ ధర చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలన్నారు. గుడా వీసీ అమరేంద్రకుమార్‌ మాట్లాడుతూ నాన్‌ లేఅవుట్లు వేసిన డెవలపర్లు, భూయజమానులు, స్థల యజమానులు అన్ని పాట్ల వివరాలను తెలియజేస్తూ లేఅవుట్ల స్కెచ్‌లను గుడా కార్యాలయానికి అందజేయాలన్నారు.


ఈ అవకాశం వినియోగించుకోకుంటే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కమిషనర్‌ కె.రమేష్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ పరిధిలోని నాన్‌ లే అవుట్‌ ప్లాట్‌లను గుర్తించి వాటిని క్రమబద్ధీకరించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ స్కీమ్‌ సకాలంలో సద్వినియోగం చేసుకుని ఏప్రిల్‌ 6లోపు దరఖాస్తు చేసుకున్న వారికి 14శాతం ఓపెన్‌ స్పేస్‌ ధరలో 50శాతం మినహాయింపు ఉంటుందన్నారు. ఇలా చెల్లించినవారికి మిగిలిన అపరాధ రుసుములు ఫిబ్రవరి 21లోపు చెల్లిస్తే 10శాతం మినహాయింపు, 90 రోజుల్లో చెల్లిస్తే 5శాతం మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-02-12T08:51:40+05:30 IST