ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2020-12-07T05:59:24+05:30 IST
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు.

రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు
గండేపల్లి, డిసెంబరు 6: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రతినిధుల 45వ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రామచంద్రరావు అఽధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి 13 జిల్లాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.తులసివిష్ణుప్రసాద్, సహాయ కార్యదర్శి ఎం.బి.ఎస్.శర్మ, కోశాధికారి ఎంవీ.రావు, ఆదిత్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.శేషారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వి.జనార్ధన్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీవీ గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల వల్ల విద్యా సంస్థలు మూతబడడంతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని అన్నారు. రాష్ట్రంలో 15 వేల పాఠశాలల్లో పనిచేస్తున్న ఐదు లక్షల మంది ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు. పాఠశాలల రికగ్నేషన్ పది సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు తగ్గించడం, టీసీలు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడంపై మారటోరియం వచ్చే జూన్ వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులంతా కన్నబాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ రూ.10 వేల వంతున ఆర్థిక సహాయాన్ని అందించేలా చూడాలని కోరారు.