ఇద్దరు బాలికలకు గర్భం!

ABN , First Publish Date - 2020-03-18T16:56:47+05:30 IST

బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని..

ఇద్దరు బాలికలకు గర్భం!

గిరిజన విద్యాలయాల్లో ఇవేం దారుణాలు

దారగడ్డ, తుని ఆశ్రమ పాఠశాలల్లో ఆలస్యంగా వెలుగులోకి..

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీవో ఆదేశం

దారగడ్డ హెచ్‌ఎం సస్పెన్షన్‌

ఇటీవలే ఏజెన్సీలో మరో రెండు అత్యాచార ఘటనలు


రంపచోడవరం(తూర్పు గోదావరి): రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని వై.రామవరం మండలం దారగడ్డ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఒకరు, తుని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఒకరు గర్భం దాల్చిన వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దారగడ్డ ఆశ్రమ పాఠశాలలో ఏడో  తరగతి చదువుతున్న విద్యార్థిని నీరసంగా ఉందన్న కారణంగా తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లి ఆరోగ్య కేంద్రంలో చికిత్సకోసం తీసుకువెళితే అక్కడి పరీక్షల్లో సదరు బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను పాఠశాల నుంచి పంపించేసినట్టు సమాచారం. ఇదిలావుండగా తునిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా గర్భందాల్చిన విషయం వెలుగు చూసింది. ఈ సంఘటనలు గిరిజన సంక్షేమ విద్యా వ్యవస్థపైనే మరోమారు విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి.


ఇటీవల డొంకరాయిలో ఓ విద్యార్థినిపై వార్డెన్‌ అత్యాచారం చేయడం, రంపచోడవరం మండలం బూసిగూడెం పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతులు తెలిసిందే. గిరిజన విద్యాలయాల్లో బాలికలకు రక్షణ కరువైందా లేక పర్యవేక్షణ లోపించిందా అన్నది సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడినో లేక వార్డెన్‌నో సస్పెండ్‌చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఉన్నతాధికారులెవ్వరూ ఇలాంటివి జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఐటీడీఏ పీవో నిశాంత్‌కుమార్‌ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ డిఫ్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. 


దారగడ్డ ప్రధానోపాధ్యాయడు సస్పెన్షన్‌

వై.రామవరం మండలం దారగడ్డ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫకీర్‌దొరను ఐటీడీఏ అధికారులు సస్పెండ్‌ చేశారు. పాఠశాల విద్యార్థులను కొట్టడం, పలు అవకతవకలకు పాల్పడడం వంటి అభియోగాలతో ఆయనను సస్పెండ్‌ చేశారని తెలుస్తోంది. అధికారులెవరూ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు. గిరిజన బాలిక గర్భం దాల్చిన పాఠశాల కూడా ఇదే కావడం విశేషం.

Updated Date - 2020-03-18T16:56:47+05:30 IST