పీకల్లోతు.. ఇదీ అవినీతి తంతు!

ABN , First Publish Date - 2020-10-13T20:31:46+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో పేదలకు ప్రభుత్వం సేకరించిన ఇళ్ల స్థలాలు వర్షాలకు నిండా మునిగాయి. 8.40 ఎకరాలను అధికారులు ముందు వెనక చూడకుండా 3.20 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే మంగళవారం కురిసిన వర్షాలకు ఇవి పూర్తిగా మునిగిపోయాయి.

పీకల్లోతు.. ఇదీ అవినీతి తంతు!

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో పేదలకు ప్రభుత్వం సేకరించిన ఇళ్ల స్థలాలు వర్షాలకు నిండా మునిగాయి. 8.40 ఎకరాలను అధికారులు ముందు వెనక చూడకుండా 3.20 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే మంగళవారం కురిసిన వర్షాలకు ఇవి పూర్తిగా మునిగిపోయాయి. దీంతో ఇప్పుడు పేదలు లబోదిబోమంటున్నారు. తమకు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో అక్కడ ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. కాగా ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వర్షపు నీటికి మునిగిపోవడంతో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వరుపుల రాజా ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆ భూమిలోనే ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎర్రవరం గ్రామంలో మునిగిపోయిన భూముల్లోకి నాయకులు దిగగా పీకల్లోతు మునిగిపోయారు. మునిగిపోయిన భూముల్లో ప్రత్తిపాడు నియోజవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా  దిగారు. తీరా పీకల్లోతు మునిగిపోవడం చూసి అవాక్కయ్యారు. పేదలకు మునిగే స్థలాలు ఇవ్వడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అనుచరులు అవినీతి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ‘‘పేదలకు ఇచ్చే స్థలాలు ఇవేనా? ఎమ్మెల్యే అయితే ఇల్లు ఇక్కడ కట్టుకుంటారా?  ఎమ్మెల్యే అవినీతిని బయటపెడతా’’ అని వరుపుల రాజా అన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇళ్ల స్థలాల పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 


ఇక్కడ లక్షల రూపాయలతో 4 అడుగులు చదును చేసినట్లు రికార్డులో చూపించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 4 అడుగులు చదును చేసి పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు ఎందుకు మునిగిపోయాయని ప్రశ్నించారు. దీనికి బాధ్యత ఎమ్మెల్యేనే వహించాలని రాజా అన్నారు. ఇళ్ల స్థలాల చదును పేరుతో నియోజకవర్గంలో కోట్ల రూపాయలను దోచుకుతిన్నారని. ఎమ్మెల్యే అవినీతిని త్వరలోనే బయట పెడతాని వరుపుల రాజా సవాల్ విసిరారు.

Updated Date - 2020-10-13T20:31:46+05:30 IST