ప్రమాణం చేయడం సమర్ధనీయమా
ABN , First Publish Date - 2020-12-26T06:00:12+05:30 IST
లౌకికవాదంలో రాజకీయ నాయకులు ఒక మత విశ్వాసాన్ని అనుసరించి ప్రమాణం చేయడం వాంఛనీయమా, సమర్థనీయ మా అని ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి, డిసెంబరు 25: లౌకికవాదంలో రాజకీయ నాయకులు ఒక మత విశ్వాసాన్ని అనుసరించి ప్రమాణం చేయడం వాంఛనీయమా, సమర్థనీయ మా అని ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రామవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన ఇటీవల బిక్కవోలులో జరిగిన సత్య ప్రమాణాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లౌకికరాజ్యంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయన్నారు. తాను అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎన్నోసార్లు సత్య ప్రమాణాలు చేయాలని కోరారని, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తాను లౌకికవాదానికి కట్టుబడి తిరస్కరించానని చెప్పారు. ఎమ్మెల్యే సత్యప్రమాణాల సవాల్ చేయడంతో తాను ఈనెల 23కు ముందు ఈ విషయాన్ని ప్రస్తావించలేదని, ప్రస్తావిస్తే వెనుకడుగు వేశానని ప్రచారం చేస్తారని అందుకే ఆపద్దర్మంగా తాను సత్య ప్రమాణానికి అంగీకరించానని రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఆదర్శమైన ప్రతిపక్ష నేతగా రామకృష్ణారెడ్డి
ఇటీవల బిక్కవోలులో జరిగిన సత్య ప్రమాణాల కార్యక్రమం ద్వారా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదర్శవంతమైన ప్రతి పక్షనేతగా వ్యవహరించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రశంసించారు. శుక్రవారం చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన సమావేశంలో రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రమమైన పద్ధతిలో ఆధారాలు సేకరించి పోరాట పటిమను కనబరచి రాష్ట్రంలోనే ఆదర్శ ప్రతిపక్ష నాయకుడిగా రామకృష్ణారెడ్డి నిలిచారని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రామకృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతూ సత్య ప్రమణాల కార్యక్రమంలో నల్లమిల్లి చూపిన తెగువ ప్రతి నాయకుడు అలవరచుకోవాలని ప్రశంసించారు.