ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2020-07-14T11:22:58+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం 145 మందికి వైరస్‌ సోకింది. అత్యధి కంగా రాజమహేంద్రవరం నగరంలో 37 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

ఉక్కిరిబిక్కిరి

 జిల్లావ్యాప్తంగా సోమవారం 145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

అత్యధికంగా రాజమహేంద్రవరంలో 37 కేసులు

 కాకినాడలో 30, పెద్దాపురం 18, సామర్లకోట 14, మండపేట 8, పిఠాపురం, బొమ్మూరుల్లో   మూడేసి చొప్పున నమోదు

 మొత్తం 3,635కి చేరిన కేసుల సంఖ్య


జిల్లాను కొవిడ్‌ కుదిపేస్తోంది. ఎక్కడికక్కడ వందల పాజిటివ్‌ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నానాటికీ తీవ్రమవుతున్న వైరస్‌ మహమ్మారి పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా చుట్టుముట్టేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఆసుపత్రులపాల్జేస్తోంది. వైద్యులు సైతం వేలల్లో పుట్టుకొస్తున్న కొవిడ్‌ కేసులతో కంటిమీద కునుకు లేకుండా పనిచేయాల్సి వస్తోంది. అసలు వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి ఎలా వ్యాపిస్తుంది? ఎవరి కాంటాక్ట్‌ ఎవరు? అనేది నిర్ధారించలేనంతగా కరోనా వ్యాపిస్తుండడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అటు వేలల్లో పెరిగిపోయిన పాజిటివ్‌ కేసులతో జిల్లాలో రెండువేల పడకలతో సిద్ధమైన బొమ్మూరు ఐసోలేషన్‌ వార్డులు సైతం కిక్కిరిసిపోయాయి. దీంతో రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త బాధితుల కోసం కోనసీమలోని బోడసకుర్రులో భారీస్థాయిలో ఐసోలేషన్‌ బెడ్‌లను సిద్ధం చేస్తున్నారు. 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం 145 మందికి వైరస్‌ సోకింది. అత్యధి కంగా రాజమహేంద్రవరం నగరంలో 37 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరంతా ఇటీవల వైరస్‌ సోకిన వ్యక్తుల కాంటాక్ట్స్‌గా అధి కారులు గుర్తించారు. తాజా కేసులతో రాజమహేంద్రవరం నగరంలో మొత్తం కేసులు 436కి చేరాయి. రూరల్‌ పరిధిలో బొమ్మూరులో మూడు పాజిటివ్‌ కేసులను గుర్తించారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో 30మందికి కొవిడ్‌ సోకింది. ఈశ్వర్‌నగర్‌లో 5, ముత్తానగర్‌ 7, జీజీహెచ్‌ పరిధిలో 13, మిగిలిన కేసులను ఏటిమొగ, జగన్నాథపురంల్లో నిర్ధారించారు. పెద్దాపురం పట్టణంలో 8, పెద్దాపురం రూరల్‌ పరిధిలోని కట్టమూరులో 6, పులిమేరులో 3, వడ్లమూరులో ఒక కేసు నమోదయ్యాయి. దీంతో మండలం మొత్తంమీద ఇప్పటి వరకు 173 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా పెద్దాపురం పట్టణంలో 69, రూరల్‌లో 104 చొప్పున నమోదయ్యాయి.


సామర్లకోట పట్టణంలో 10, రూరల్‌లోని వేట్ల పాలెంలో నలుగురికి కొవిడ్‌ సోకినట్టు వైద్యులు ప్రకటించారు. మండపేట పట్టణంలో 5, రూరల్‌ 3, 5, పిఠాపురం మూడు, కాట్రేనికోనలో రెండు కేసుల చొప్పున గుర్తించారు. బిక్కవోలు1, యానాం 10, చిం తూరు మండలంలో ఒకటి, పి.గన్నవరం, కాజులూరుల్లో చెరొక కేసు నమోదైంది. ప్రత్తిపాడు  మండలంలో ఓ  ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడికి పాజిటివ్‌ నిర్ధారించారు. పిఠాపురంలో ఓ ప్రైవేటు చంటి పిల్లల ఆసుపత్రిలో వైద్యుడికి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగికి వైరస్‌ సోకింది. మిగిలిన కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి. 


నాలుగు మరణాలు

కాగా సోమవారం నాలుగు కొవిడ్‌ మరణాలు సంభవించాయి. సామర్లకోట ప్రకాష్‌నగర్‌కు చెందిన 74 సంవత్సరాల వ్యక్తి మూడు రోజుల క్రితం శ్వాసకోస ఇబ్బందులతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. ఇంటి వద్దే వైద్యం పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించాడు. అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయోధ్యరామపురం క్లబ్‌ వీధికి చెందిన 72 సంవత్సరాల వృద్ధురాలు పాజిటివ్‌తో మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. పెద్దాపురం నువ్వులగుంట వీధిలో నివాసం ఉంటున్న ఓ విశ్రాంత బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.


అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు మునిసిపల్‌ కమిషనర్‌ గుంటూరు శేఖర్‌ తెలిపారు. శంఖవరం మధ్య వీధి రామాలయం ప్రాంతానికి చెందిన వృద్ధుడు (75) తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబీకులు అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువస్తుండగా మరణించాడు. మృతదేహానికి కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.కిరణ్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-14T11:22:58+05:30 IST