ఈ పోలీసుకు ఏమైంది?

ABN , First Publish Date - 2020-07-27T15:16:59+05:30 IST

ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులు దారి తప్పారు. కొందరు ఒత్తిళ్లకు..

ఈ పోలీసుకు ఏమైంది?

నెల రోజుల్లో ఆరుగురు ఎస్‌ఐలు సస్పెన్షన్‌

సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఓ ఎస్‌ఐ

ఓ సీఐకూ సస్పెన్షన్‌, కొందరు వీఆర్‌లోకి

ఒత్తిళ్ల మధ్య చిక్కుకుని కొందరు బలి

కొంతమందిది ఇష్టారాజ్యం


(రాజమహేంద్రవరం/ కాకినాడ-ఆంధ్రజ్యోతి): ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులు దారి తప్పారు. కొందరు ఒత్తిళ్లకు లొంగి బలైపోతుంటే, మరికొందరు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో ఆరుగురు ఎస్ఐలు జిల్లాలో సస్పెండ్ అయ్యారంటే ఇక్కడి పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చు. పలువురు కానిస్టేబుళ్ల పరిస్థితి కూడా ఇంతే. అక్కడక్కడా సీఐలకు మెమోలు జారీ అయ్యాయి. ఒక ఎస్ఐని ఏకంగా అరెస్టు చేయాల్సి వచ్చింది. కొన్ని కేసుల్లో పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు కూడా ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థలో ఏమి జరుగుతుందనేది ప్రజల్లో చర్చ మొదలైంది. పోలీసు శాఖలోనూ కలకలం రేగుతోంది.


కొన్నేళ్లుగా ఎస్‌ఐ, సీఐలకు పోస్టింగ్‌ లభ్యం కావడమే కష్టమవుతోంది. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. డబ్బు ఇస్తేనే కాని సరైన ప్రాంతంలో పోస్టింగ్‌ దొరకడంలేదు. ఇక్కడ సరైన అనే పదానికి డబ్బు బాగా రావచ్చనే అర్థం. లంచాలు ఇవ్వని అధికారులకు పోస్టింగులు ఉండవు. ఎక్కువమంది శాంతిభద్రల విభాగంలోనే పనిచేయడానికి ఇష్టపడతారు. మిగతా విభాగాల్లో పోస్టంటే చిన్నదిగా ఫీలవుతుంటారు. ఉద్యోగం వచ్చేవరకూ ఒక ఆలోచన వచ్చిన తర్వాత మరో ఆలోచన. దీనికితోడు కుల ప్రభావంతోపాటు, అధికార పార్టీకి అనుకూలత కూడా చూస్తుంటారు. ఈ క్రమంలో అనేకమందికి పోస్టింగ్‌లు కూడా ఉండవు. పోలీసు శాఖలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, కొందరు ఎస్‌ఐలు, సీఐలు ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారో అర్థంకావడం లేదు. ఇటీవల అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడి కూడా బాగా పెరిగిందనే ప్రచారం ఉంది.


కొంతమంది పోలీసులు తమదే ఇష్టారాజ్యమన్నట్టు వ్యవహరిస్తారు.  పోలీసులను చూస్తే గౌరవించేలా ఉండాలి. మంచి పోలీసులను ప్రజలెప్పుడూ మరచిపోరు. కానీ పరిస్థితి మారింది. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పరిశీలిస్తే ఆశ్చర్యకరకంగా ఉండడంతోపాటు ఇక ప్రజలకు రక్షణ ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నెల రోజుల కిందట ముమ్మిడివరం స్టేషన్‌ పరిధిలో ఓ సంఘటన జరిగింది.  బంధువుల మధ్య గొడవ వల్ల ఒక వ్యక్తిని హనీట్రాప్‌ చేసి చంపేశారు. ఒక మహిళతో ఫోన్‌ చేసి కాకినాడ రప్పించి, అక్కడ చంపేశారు. తర్వాత ఆరు నెలల వరకూ ఆమెతో అతని ఇంటికి ఫోన్‌ చేయించి తామిద్దరం పెళ్లిచేసుకున్నామని, వేరే ఊరిలో ఉన్నామని చెప్పించేవారు. కానీ నెమ్మదిగా విషయం బయటకు వచ్చింది. ఈ విషయపై ముందుగా ముమ్మిడివరం స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ  అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎస్‌ఐ ఎం.పాండుదొరను సస్పెండ్‌ చేశారు.


ఇటీవల సీతానగరంలో ఎస్‌ఐ ఫిరోజ్‌షాను ఏకంగా అరెస్ట్‌ చేసే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రస్తుతం  సెంట్రల్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మునికూడలిలో ఒక ఇసుక లారీ ఒక వ్యక్తిని ఢీకొట్టిన నేపథ్యంలో జరిగిన ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రసాద్‌ అనే వ్యక్తికి పోలీసు స్టేషన్‌కు తీసుకునివెళ్లి, తీవ్రంగా కొట్టడంతోపాటు స్టేషన్‌లో శిరోముండనం చేయించారు. ఈ కేసులో ఎస్‌ఐను అరెస్ట్‌ చేయగా, హెడ్‌కానిస్టేబుల్‌ అప్పారావును, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతకుముందే ఇక్కడ ఇంకో ఎస్‌ఐ సస్పెండయ్యారు. ఒక వ్యక్తి తాను డీఎస్పీనని చెప్పి నకిలీ డీఎస్పీగాగా పలువురి నుంచి డబ్బులు గుంజిన కేసులో జరిగిన వ్యవహారంలో అక్కడి ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.


గండేపల్లిలో రెండు నెలల కిందట నకిలీ ఆయిల్‌ ట్యాంకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. సరైన బిల్లులు చూపకపోవడంతో ట్యాంకర్‌ను సీజ్‌ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే లారీ డ్రైవర్‌ తన యజమానికి ఫోన్‌లో విషయం చెప్పాడు. యజమానితో పోలీసులు రూ.2 లక్షల లంచానికి బేరమాడుకుని ఎస్‌ఐ తిరుపతిరావు, రామకృష్ణ, శ్రీనివాస్‌ అనే కానిస్టేబుళ్లు లారీని వదిలేశారు. కానీ వీళ్లని దురదృష్టం వెంటాడినట్టుంది. ఏలూరు సమీపంలోని కలపర్రు చెక్‌పోస్ట్‌ వద్ద మళ్లీ ఈ లారీని అక్కడ పోలీసులు పట్టుకున్నారు. దీంతో లారీ డ్రైవర్‌ రివర్సై ఎంతమందికి ఎంత డబ్బు ఇవ్వగలమని ఎదురు తిరిగాడు. దాంతో కథ అడ్డం తిరిగింది. దీనిపై ఉన్నతాధికారుల విచారణ అనంతరం ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.


ఏలేశ్వరానికి చెందిన న్యాయవాది సుభాష్‌చంద్రబోస్‌ అక్రమంగా అరెస్ట్‌ చేసిన కేసులో రాజమహేంద్రవరం త్రీటౌన్‌ ఎస్‌ఐ హరిబాబు, ఏలేశ్వరం ఎస్‌ఐ సుధాకర్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసులో త్రీటౌన్‌ సీఐ, ప్రత్తిపాడు సీఐలతోపాటు కానిస్టేబుళ్లకు మెమోలు ఇచ్చినట్టు సమాచారం. సాధారణంగా పోలీసు స్టేషన్‌లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవలసిన అధికారం ఎస్‌ఐకే ఉంటుంది. సీఐలు పర్యవేక్షణ చేయాలి. వారిపైన డీఎస్పీ ఉంటారు.


ఇవాళ ఎస్‌ఐలు ఎక్కువ మంది యూత్‌ లేదా మధ్యవయస్కులే. ఎందుకో వీరంతా అపఖ్యాతిని మూటకట్టుకుంటున్నారు.  పలు కేసులలో డబ్బులకు కక్కుర్తి పడుతుంటే, పలు కేసుల్లో అధికారులు, రాజకీయనేతల ఒత్తిళ్ల కు లొంగిపోతున్నారు. అభద్రతాభావంతో, బాగా డబ్బు సంపాదించాలనే దురాశోకానీ, ఏకంగా ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాక కింది స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే  ప్రచారం ఉంది.  పోలీసంటే  ప్రజలను రక్షించేవా డు. అతనికి జీతం కూడా వస్తుంది. నిజాయతీగా పనిచేస్తే గౌరవమూ ఉంటుంది.  


సీఐలపైనా వేటు

అంతకుముందు ఒక గ్యాంబ్లింగ్‌ కేసులో అవినీతికి పాల్పడిన రంపచోడవరం సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. పలు ఆరోపణలు రుజువు కావడంతో పిఠాపురం సీఐ బీఎస్‌ అప్పారావు, అమలాపురం రూరల్‌ సీఐ భీమరాజు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావును డీఐజీ వీఆర్‌లో ఉంచారు. 


ఛీటర్‌ నుంచీ కొట్టేశారు..

లాక్‌డౌన్‌ సమయంలో పిఠాపురానికి చెందిన రైతును అనంతపురం వ్యక్తి తన వద్ద రైస్‌ పుల్లింగ్‌ లోహం పేరుతో రూ.10 లక్షలు లాగే శాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనంతపురం వెళ్లి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. నగదును రాబట్టారు కానీ కొంత కొట్టేశారు. మరో కేసులో ఇది వెలుగులోకి రాగా పోలీసులపై వేటు పడింది.Updated Date - 2020-07-27T15:16:59+05:30 IST