ఇంటి దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2020-12-13T05:50:03+05:30 IST

కొత్తపేట కెనరా బ్యాంకులో బంగారం, నగదు ఎత్తుకెళ్లిన తాత్కాలిక ఉద్యోగిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

ఇంటి దొంగ అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

  డబ్బు, బంగారంతో ఉడాయించిన కెనరా బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి

కాకినాడ క్రైం, డిసెంబరు 12: కొత్తపేట కెనరా బ్యాంకులో బంగారం, నగదు ఎత్తుకెళ్లిన తాత్కాలిక ఉద్యోగిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.  కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ శనివారం వివరాలు వెల్లడించారు. అమలాపురం మండలం జనుపల్లి శ్రీకృష్ణ దేవరాయవీధికి చెందిన బండారు తులసి సురేష్‌ కొత్తపేట గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకులో 2018 జూన్‌ నుంచి తాత్కాలిక మెసంజర్‌గా పని చేస్తున్నాడు. మద్యం, చెడు వ్యసనాలకు అలవాటుపడిన తులసి సురేష్‌ సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో తాను పని చేస్తున్న బ్యాంకునే టార్గెట్‌ చేసుకున్నాడు. బ్యాంకులో నగదు, బంగారం చోరీ కోసం నాలుగు రోజుల ముందుగా రెక్కీ నిర్వహించాడు. చోరీ పథకాన్ని ఈనెల 7వ తేదీన అమల్లో పెట్టాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కెనరా బ్యాంకు సిబ్బంది భోజనానికి వెళ్లడంతో బ్యాంకులో సీసీ కెమెరా యుపీఎస్‌ పవర్‌ నిలుపుదల చేశాడు. తర్వాత తన వద్ద ఉన్న మారు తాళాలను ఉపయోగించి బ్యాంకులో ఉన్న రూ. 9,23,000 లక్షల నగదుతో పాటు సుమారు 322 గ్రాముల బంగారు వస్తువులను దొంగిలించి పరారయ్యాడు.  ఎస్పీ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ కరణం కుమార్‌, అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి పర్యవేక్షణలో రావులపాలెం సీఐ వి.కృష్ణ, కొత్తపేట ఎస్‌ఐ రమేష్‌, అడిషనల్‌ ఎస్‌ఐ కేవీఎస్‌ సత్యనారాయణ దర్యాప్తు చేసి శనివారం అమలాపురంలోని కోకాస్‌ లాడ్జిలో నిందితుడు బండారు తులసి సురేష్‌ను అరెస్ట్‌ చేశారు.   రూ. 7.90 లక్షల నగదు, 322 గ్రాముల బంగారం, రూ. 51 వేలు విలువైన గోల్డ్‌రింగ్‌లు, బైక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ గరుడ్‌ సుమిత్‌, అదనపు ఎస్పీ కుమార్‌, అమలాపురం డీఎస్పీ వై. మాధవరెడ్డి, రావులపాలెం సీఐ వి. కృష్ణ, ఎస్‌బీ డీఎస్పీ ఎం. అంబికాప్రసాద్‌, సీఐ నక్కా రజనీకుమార్‌, కొత్తపేట ఎస్‌ఐ రమేష్‌, అడిషనల్‌ ఎస్‌ఐ కేవీఎస్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. రూ. 16.19 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2020-12-13T05:50:03+05:30 IST