పోలవరం పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-06-26T10:42:21+05:30 IST

‘పోలవరం పనులు వేగవంతం చేయాలి. 2021 నాటికి పూర్తి కావాలని’ సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికార్లను ఆదేశించారు.

పోలవరం పనులు వేగవంతం చేయాలి

2021కి పూర్తికావాలి

పవర్‌ ప్రాజెక్టు..  ఎల్‌ఎంసీ పనులు కూడా 

త్వరలో స్పిల్‌వే రోడ్డుకు శ్లాబ్‌ నిర్మించే యోచన

జూలైలో 10 వేల మంది నిరాశ్రయుల తరలింపు

పోలవరం మీద ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష 

సీఈ సుధాకర్‌బాబుకు ఆదేశం


రాజమహేంద్రవరం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ‘పోలవరం పనులు వేగవంతం చేయాలి. 2021 నాటికి పూర్తి కావాలని’ సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికార్లను ఆదేశించారు. అమరావతిలో వివిధ ఇరిగేషన్‌ ప్రాజెక్టులతోపాటు పోలవరంపై కూడా సమీక్షించారు. పోలవరం పనులు ఇంతవరకూ ఏమేరకు జరిగాయనే విషయాన్ని ఆరా తీశారు.  సీఈ సుధాకరబాబు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల  మేఘా కంపెనీ పనులు మొదలెట్టిన తర్వాత 2 లక్షల 76వేల  క్యూబిక్‌ మీటర్ల  స్పిల్‌వే స్పియర్లు, స్పిల్‌ చానళ్లు కాంక్రీట్‌ పని జరిగింది. ఏప్రిల్‌లో 43 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, మే నెలలో 53 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, జూన్‌ నెలలో ఇప్పటి వరకూ 48 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేశారు. 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్కు చేశారు. పవర్‌హౌస్‌కు సంబంధించి 2 లక్షల 41వేల క్యూబిక్‌ మీటర్ల ఫౌండేషన్‌ వర్కు చేశారు.


నవంబర్‌లో ఎగువ దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించి, జనవరి తర్వాత ప్రధాన డ్యామ్‌ అయిన ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను పూర్తి చేయడానికి నిర్ణయించారు. కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణానికి కనీసం మూడు నెలలు పడుతుందని అంచనా. నవంబరులో స్పిల్‌వే గేట్లు పూర్తి చేయాలని చూస్తున్నారు. కానీ వీటికి హైడ్రాలిక్‌ సిలెండర్లు అవసరం. అవి జర్మనీ నుంచి రావాలి. వాస్తవానికి అధికారులు అక్కడకు వెళ్లి, వాటిని పరిశీలించి ఆర్డర్‌ ఇవ్వవలసి ఉంది. కానీ కరోనా వల్ల డిజైన్‌ పంపి చేయించడానికి నిర్ణయించారు. ఇక్కడకు తెచ్చిన తర్వాత చెక్‌ చేసి, అమర్చడానికి ఒప్పందం చేసుకోనున్నారు. దీనికి అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మేఘా కంపెనీ ప్రస్తుతం రూ.1572 కోట్ల విలువైన స్పిల్‌వే పనులు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.


ఇంతవరకూ రూ.260 కోట్ల పనులు జరిగాయి. స్పిల్‌వేకు 52 స్పియర్లు నిర్మిస్తున్నారు. 55 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం స్పియర్ల సరాసరి ఎత్తు 47.44 మీటర్లు నిర్మించారు. 52 మీటర్లు నిర్మించిన తర్వాత దానిపై రోడ్డు నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల వరదలు వచ్చినా పనులకు ఇబ్బంది ఉండ దని చెబుతున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా త్వరగా మొదలెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కాలువలో   కుమ్మరకాలువ వద్ద 1.5 భూసేకరణ సమస్య ఉంది. వారికి వెంటనే ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ మరో మూడు స్ట్రక్చర్లు కూడా నిర్మించవలసి ఉంది. తాండవ బ్రిడ్జికి కూడా మరమ్మతులు చేయవలసి ఉంది.

Updated Date - 2020-06-26T10:42:21+05:30 IST