ముంచిన తర్వాత..పంచుతారా?
ABN , First Publish Date - 2020-12-10T06:00:55+05:30 IST
గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా నిర్మిస్తున్న పునరావాస కాలనీలను వెంటనే నిలుపుదల చేయాలని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.

పోలవరం పరిహారం ఇచ్చిన తర్వాతే పునరావాస పనులు చేయాలి
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు9: గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా నిర్మిస్తున్న పునరావాస కాలనీలను వెంటనే నిలుపుదల చేయాలని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన బాధిత రైతులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కృష్ణునిపాలెంలో ఐదెకరాల దళితుల భూములు తీసుకుని నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. అప్పటి తహశీల్దార్ అవినీతి వల్ల బాధిత రైతులకు రావాల్సిన పరిహారం పక్కదారి పట్టి వేరొకరికి చేరిందన్నారు.కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూములను వినియోగించడానికి వీల్లేదన్నారు. నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి పునరావాస కాలనీ నిర్మించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే బాధిత రైతులను మోసం చేసిన అప్పటి తహశీల్దార్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. బాధిత దళితులు గరుగుబిల్లి వెంకాయమ్మ, బేదంపూడి కృష్ణ, దిబ్బ శ్రీను, తలాటి కృష్ణ పాల్గొన్నారు.