విష గుళికల గడ్డి మేసి పశువులు మృతి
ABN , First Publish Date - 2020-10-27T06:14:08+05:30 IST
విష గుళికలు కలిసిన గడ్డి మేసి నాలుగు పశువులు మృతిచెందగా, మరికొన్ని పశువులను పశు సంవర్ధకశాఖ సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఎటపాక, అక్టోబరు 26: విష గుళికలు కలిసిన గడ్డి మేసి నాలుగు పశువులు మృతిచెందగా, మరికొన్ని పశువులను పశు సంవర్ధకశాఖ సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ఎటపాక మండలం గౌరిదేవిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఎం.నర్సింహరావు, పి.రమేష్, ఎం.పుల్లారావు, వెంకటరమణల పశువులను గౌరిదేవిపేట సమీపంలోని గోదావరి ప్రాంతం మధ్యలో ఉన్న(గడ్డ)కు మేతకు తీసుకెళ్తుంటారు. ఈక్రమంలో ఆదివారం గడ్డి మేసిన పశువులు కడుపు ఊబ్బుతో మృతిచెందాయి. విషయం పశు సంవర్ధకశాఖ సిబ్బందికి తెలపడంతో వారు వెంటనే 25 పశువులకు వైద్యం అందించారు. గడ్డ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు పిట్టల వేటకోసం విష గుళికలను పెట్టడం వల్లే తమ పశువులు మృతి చెందాయని రైతులు పేర్కొంటున్నారు. మృతిచెందిన పశువుల విలువ రూ.1.70 లక్షలు ఉంటుందని వారు తెలిపారు.