వైసీపీలో కుమ్ములాట

ABN , First Publish Date - 2020-11-26T06:15:16+05:30 IST

వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. పిఠాపురంలో..

వైసీపీలో కుమ్ములాట

పిఠాపురంలో బహిర్గతమైన వర్గ పోరు

బాహాబాహీకి దిగిన రెండు వర్గాల నాయకులు


పిఠాపురం:  వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. పిఠాపురంలో ఆ పార్టీ నేతలు వీధికెక్కారు. పరస్పరం తోపులాటకు దిగారు. పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన ‘జగనన్న తోడు’ ప్రారంభ సమావేశంలో ఈ దృశ్యాలు కనిపించాయి. వివరాలు ఇలా వున్నాయి... జగనన్న తోడు’ పథకాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో స్థానిక నాయకులకు ఫోను చేసి సభను నిర్వహించమని చెప్పారు. దీంతో వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య వేదికపైకి కొందరు నాయకులను మాత్రమే పిలిచాడు. మాజీ కౌన్సిలర్‌ అయిన తనను పిలవకపోవడంపై ఖండవల్లి లోవరాజు కోపద్రిక్తుడయ్యాడు. తనను వేదికపైకి ఎందుకు ఆహ్వానించలేదంటూ నిలదీశాడు. పార్టీలో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో మాజీ కౌన్సిలర్‌ భర్త వజ్రపు వీరేష్‌ కలుగజేసుకుని వేదికపైకి అందరినీ పిలవడం సాధ్యం కాదన్నారు. దీంతో లోవరాజు, వీరేష్‌ మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్తా తోపులాటకు దారితీసింది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. సీనియర్‌ నేతలు కలుగజేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం లబ్ధిదారులకు రుణ అర్హత పత్రాలు పంపిణీ చేశారు. 


Updated Date - 2020-11-26T06:15:16+05:30 IST