అలర్ట్‌ అంతంతే!

ABN , First Publish Date - 2020-03-24T06:48:39+05:30 IST

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అనే సామెత ఉంది. ‘చేతులారా చేసుకున్నాడు..’ అన్న నానుడీ వింటూనే ఉంటాం. చేతుల

అలర్ట్‌ అంతంతే!

కరోనాపై అలర్ట్‌కు లాక్‌డౌన్‌ ప్రకటించినా రోడ్లపైకి జనం

బయటకు రావొద్దని సర్కార్‌ ఆదేశించినా గుంపులుగా సంచారం

సోమవారం జిల్లాలో మరో 11 మందికి అనుమానిత లక్షణాలు 

మొత్తం 45కు చేరిన అనుమానిత రోగుల సంఖ్య

శాంపిళ్లు ఇకపై పుణేకు పంపకుండా కాకినాడ ల్యాబ్‌లోనే పరీక్ష

మరోపక్క నిషేధం ఉన్నా యథేచ్ఛగా తిరుగుతున్న ఆటోలు, కార్లు

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు పావు శాతమే 

ఎక్కడికక్కడ బస్సులు బంద్‌, 25 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఎక్కడికక్కడే


కాకినాడ, మార్చి 23 :

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అనే సామెత ఉంది. ‘చేతులారా చేసుకున్నాడు..’ అన్న నానుడీ వింటూనే ఉంటాం. చేతుల ద్వారా అధికంగా వ్యాప్తి చెందే కరోనాను అరికట్టడానికి దేశవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటించడం ద్వారా ఈ రాక్షసిని రూపుమాపొచ్చు. అందుకునే బయట తిరగొద్దని ప్రభుత్వాలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నాయి. కానీ సోమవారం పరిస్థితి చూస్తే అలా లేదు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు జిల్లాలో పెద్దగా అమలుకు నోచుకోలేదు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సర్కార్‌ ఆదేశించినా స్పందన అంతంత మాత్రమే కనిపించింది.


ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజా రవాణాను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం తద్వారా రహదారులపై జనసంచారం  లేకుండా కట్టడి చేయాలని భావించింది. కానీ దీనికి విరుద్ధంగా  సోమవారం జిల్లాలో ఎక్కడికక్కడ ప్రజలు గుంపులుగా తిరిగారు. మాల్స్‌, వ్యాపార దుకాణాలు, కాలేజీలు అన్నీ మూతపడ్డా ఏదొక కారణంతో రహదారులపైకి వచ్చారు. అటు బస్సులు రద్దవడంతో ఇదే అదనుగా ఆటోలు యథేచ్ఛగా ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగాయి. జిల్లాలోని  అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది పావుశాతం మందే విధులకు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ సాకుతో కూరగాయల ధరలను భారీగా పెంచేశారు.


కరోనా వైరస్‌ జనసమూహాల్లో సులువుగా విస్తరించి ప్రజల ప్రాణాలకు చేటు చేసే ప్రమాదం ఉండడంతో దీన్ని నియంత్రించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రజారవాణా పూర్తిగా నిషేధంలోకి వచ్చింది. ఎక్కడా వాణిజ్య దుకాణాలు తెరవకూడదని ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అవసరమైతేనే జనం బయటకు రావాలని సీఎం జగన్‌  నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఆదేశాలు ఇచ్చారు. కానీ దీనికి విరుద్దంగా సోమవారం జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట తదితర పట్టణాలతోపాటు గ్రామాల్లోను జనం యథావిథిగా ఆరుబయట సంచరించారు.


ఉదయం నుంచి  రాత్రి వరకు ఎక్కడికక్కడ రహదారులపై గుంపులుగా తిరిగారు. కొందరైతే యువకులు బైకులపై ట్రిపుల్‌ రైడింగ్‌లతో హడలెత్తించారు. వ్యక్తిగత కార్లలో కిక్కిరిసి ప్రయాణించారు. వాస్తవానికి లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పుడు అత్యవసర పనులపై మినహా బయట తిరగడం నిషిద్దం. కానీ లాక్‌డౌన్‌ను చాలామంది తేలిగ్గా తీసుకున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి సులువుగా ప్రబలే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్నాయి. అటు పోలీసులు సైతం ఎక్కడా రహదా రులపై తిరిగే వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దీంతో అవస రం లేకపోయినా రహదారులపై తిరిగే వారి సంఖ్య ఎక్కు వైంది. ఒకరకంగా పట్టణాల కంటే పల్లెల్లోనే లాక్‌డౌన్‌ ప్రభా వం బాగా కనిపించింది. జనం పలుచోట్ల చాలా స్వల్పంగా బయటకు వచ్చారు. అటు లాక్‌డౌన్‌ ప్రభావంతో జిల్లావ్యా ప్తంగా దాదాపు అన్ని వాణిజ్య దుకాణాలు పూర్తిగా ఎక్కడి కక్కడ మూతపడ్డాయి. 90 శాతం మేర ఏవీ తెరుచుకోలేదు. మందుల దుకాణాలు,  కిరాణా షాపులు మినహా మిగిలిన వన్నీ మూత పడ్డాయి. అక్కడక్కడా హోటళ్లు, రెస్టారెంట్లు గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు నిర్వహించారు.


మరో ఎనిమిది కేసులు..

కరోనా అనుమానిత లక్షణాలు సోమవారం జిల్లాలో మ రో ఎనిమిది వెలుగులోకి వచ్చాయి. వీరిలో కాకినాడ, సామ ర్లకోట, యు.కొత్తపల్లి, తాళ్లరేవులకు చెందిన వారున్నారు. వీరిని కాకినాడ జీజీహెచ్‌లోని ఐసొలేషన్‌ వార్డుకు తరలిం చారు. దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురిని కాకినాడ జీజీహెచ్‌లో పరీక్షించి బొమ్మూరులోని హోం క్వారంటైన్‌కు తరలించారు. రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరిని, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒకరిని రాజమహేంద్రవ రం ఆసుపత్రి ఐసొలేషన్‌ విభాగంలో ఉంచారు. కాగా వీరితో కలిపి జిల్లావ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలు న్న వారి సంఖ్య 45కు చేరింది. ఇందులో రాజమహేంద్రవరా నికి చెందిన ఓ యువకుడికి పాజిటివ్‌ రాగా, ఇంకో 11 మంది ఐసొలేషన్‌ వార్డులో ఉన్నారు.


మిగిలిన వారికి నెగిటివ్‌ రావడంతో ఇంటికి పంపేశారు. ఇదికాకుండా వివిధ దేశాల్లో ఉంటూ జిల్లాకు వచ్చిన 1700 మందిపై వైద్యశాఖ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది. కాగా ఇప్పటివరకు కరోనా అనుమానితుల రక్తనమూనా శాంపిళ్లను పుణేకు పంపించగా, ఇకపై మంగళవారం నుంచి కాకినాడలోని వైరా లాజీ ల్యాబ్‌లో చేయనున్నారు. ఇక్కడ తీసిన శాంపిళ్ల లో పదింటిని మళ్లీ పుణేకు పంపించగా, కాకినాడ ల్యాబ్‌లో వచ్చిన ఫలితాలే అక్కడా చూపించాయి. దీంతో పది కేసులు అక్కడాఇక్కడా ఒకేలా వస్తే పదకొండో కేసు నుంచి పుణేకు పంపించకుండా కాకినాడలోనే నిర్థారించవచ్చు. దీంతో కరో నా అనుమానితులకు చేసే పరీక్షలకు సంబంధించి నివేది కలు 24 గంటల్లోనే వెల్లడి కానున్నాయి. 


బస్సులు.. రైళ్లు.. అన్నీ రద్దు...

ఆదివారం ఉదయం ఏడు తర్వాత బస్సులు, రైళ్లు జిల్లా వ్యాప్తంగా రద్దయ్యాయి. తిరిగి రాత్రి తొమ్మిది తర్వాత ఇవ న్నీ యథావిథిగా నడుస్తాయని భావించినా రాష్ట్రప్రభుత్వం ఈనెల 31వరకు లాక్‌ డౌన్‌ విధానం వర్తింపచేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఎక్కడిబస్సులు అక్కడే ఆగిపోయాయి. అటు రైళ్లు కూడా గూడ్స్‌ మినహా మిగిలినవన్నీ రద్దయ్యాయి. తొలుత ప్యాసింజర్‌ రైళ్లు మినహా మిగిలినవన్నీ నడుస్తాయ ని రైల్వే ప్రకటించినా ఆతర్వాత ఇతర అన్ని రైలు సర్వీసులు రద్దు చేసింది.


దీంతో సామర్లకోట, రాజమహేంద్రవరం స్టేష న్లమీదుగా ఒక రోజులో ప్రయాణించే సుమారు 26 ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు కూ డా మూతపడ్డాయి. దీంతో స్టేషన్లన్నీ ఖాళీగా దర్శనమి చ్చా యి. ఇదే సమయంలో ఆటోలపైనా నిషేధం ఉన్నప్పటికీ అవెక్కడా ఆగలేదు. జిల్లావ్యాప్తంగా ఆటోలు తెల్లవారు నుం చే రోడ్డెక్కాయి. బస్సులు లేవనే సాకుతో అధిక ధరలు వ సూలు చేసి ప్రయాణికులను కుక్కి మరీ నడిపారు. ఆటోలు వెళ్తున్నా పోలీసులు చూసీచూడనట్టే వ్యవహరించారు. 


కూరగాయల ధరలకు రెక్కలు...

లాక్‌డౌన్‌తో అంతర్‌రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు, ఇతర వాహనాల రాకపోకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సర్వీసుల వాహనాలకు మి నహాయింపు ఇచ్చింది. కానీ ఇదేదీ పట్టించుకోకుండా ఈనెల 31వరకు కూ రగాయలు దొరకవనే కారణంతో జనం రైతుబజార్ల వద్ద ఎగబడ్డారు. ఇదే అద నుగా వ్యాపారులు ధర లు పెంచేశారు. వాస్తవానికి కూర గాయల లభ్యతకు, వీటి రవా ణాకు పెద్దగా ఇబ్బందుల్లేవు. కానీ లాక్‌డౌన్‌ సాకుతో వ్యాపారులు ధరలు పెంచేశారు. ముఖ్యంగా టమోటా ధర కిలో మొన్నటివరకు రూ.10 నుం చి రూ.15 వరకు విక్రయించగా, సోమవారం రూ.30కి పెంచారు.


బెండ, బీర, మిర్చి, బంగాళదుంపల ధరలు కూడా కిలోకు బయట వ్యాపారులు రూ.10 వరకు పెంచారు. వాస్తవానికి వీటిని అధిక ధరలకు విక్రయిస్తే జైలుశిక్ష విధి స్తామని సీఎం జగన్‌ ఆదివారం ప్రకటించారు. కానీ కాకి నాడ, రాజమహేంద్రవరం తదితర చోట్ల ఎక్కువ ధరలకు విక్రయించినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. కాగా వీటి ధరలు రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగి పోతాయనే భయంతో జనం రైతుబజార్లలో క్యూ కట్టారు. కాగా జనం భారీగా పోగవడంతో కాకినాడ, రాజమహేంద్ర వరం రైతు బజార్లలో హ్యాండ్‌ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేందుకు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు. మాస్క్‌లు లేకపోతే కొన్ని చోట్ల లోపలకు అనుమతించలేదు. 


పావుశాతం మందే హాజరు..

ప్రభుత్వ ఉద్యోగులకు వంతులవారీ విధానం అమల్లో భాగంగా జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు, సిబ్బం ది పావుశాతం మందే హాజరయ్యారు. మిగిలిన వారంతా సెలవులో ఉన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోను, ఇతర అన్ని జిల్లా ప్రభుత్వశాఖల్లోను గెజిటెడ్‌ అధికారులు మినహా మిగిలిన సిబ్బంది చాలా స్వల్పంగా విధులకు వచ్చారు. అటు కలెక్టరేట్‌లో సోమవారం ఇన్చార్జి మంత్రి నాని సమీక్షల్లో భాగంగా కలెక్టర్‌ తక్కువమంది అధికారులతో సోమవారం సమీక్షించారు. ఇద్దరు అధికారుల మధ్య ఒక్కో సీటు దూరం ఉంచి కూర్చోబెట్టి సమీక్ష జరిపారు.

Read more