పత్తి కొనుగోళ్లలో దళారుల హవా
ABN , First Publish Date - 2020-12-17T07:27:08+05:30 IST
ఏజెన్సీలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో చిక్కుకుంటూ దగా పడుతున్నారు.

సీసీఐ కేంద్రానికి వెళ్లాలంటే 250 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..
తూకాల్లోనూ మోసం
విలీన మండలాల్లో తెలంగాణ వ్యాపారుల కొనుగోళ్లు
ఎటపాక, డిసెంబరు 16 : ఏజెన్సీలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో చిక్కుకుంటూ దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో రైతులు చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది.. దీంతో ఏజెన్సీలో ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంట చివరకు దళారులు చెప్పిందే రేటుగా మారుతోంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పత్తి పండించే రైతులు తెలంగాణ వ్యాపారుల చేతిలో మోసపోతూ చిత్తువుతున్నారు. తెలంగాణకు చెందిన పత్తి వ్యాపారులు తూకాలు తక్కువగా చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగు తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది విలీన మండలాల్లో సుమారు 7వేల నుంచి 8 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇటీవల పలు ప్రాంతాల్లో పత్తి తీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో తెలంగాణకు చెందిన దళారులు రంగ ప్రవేశం చేశారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఎక్కడా గిట్టు బాటు ధర ఇచ్చే పరిస్థితి కనిపించకపోగా, తూకాల్లో దారుణంగా మోసం చేస్తున్నారు.
గిట్టుబాటు ధర రూ.5,800
ఈ ఏడాది సీసీఐ కేంద్రాల్లో ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.5,800 కాగా బీ గ్రేడ్ రకం క్వింటా రూ.5,600గా మద్దతు ధర ఉంది. ప్రస్తుతం విలీన మండలాల్లో పత్తి తీసే పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే విలీన మండలాల్లో ఒక్క పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా అధికా రులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతంలో పండించిన పత్తిని రైతులు కొనుగోలు కేంద్రంలో విక్రయించాలంటే 250 కిలోమీటర్ల దూరాన ఉన్న కిర్లంపూడి, పెద్దాపురంలలోని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లాలి. దీంతో అంతదూరం వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకొన్నది కావడంతో విలీన మండలాల రైతులు ఆ రెండు కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి. మూడేళ్ల కిందట తెలం గాణలోని భద్రాచలం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో విలీన మండ లాల్లోని కొందరు విక్రయించేవారు. అయితే అక్కడి అఽధికారులు ఈ మూడేళ్ల నుంచి ఏపీకి చెందిన విలీన మండలాల రైతుల పత్తిని కొనుగోలు చేయలేమని తేల్చిచెప్పారు. దీంతో విలీన మండలాలైన కూనవరం, ఎటపాక రైతులు చాలామంది దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే ఆసరాగా భావించిన తెలంగాణ దళారులు కొందరు క్వింటాకు రూ.4,900 నుంచి రూ.5 వేల ధరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇదేకాక ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌రకంతోపాటు పంట నాణ్యత సరిగా లేదంటూ ఇంకాస్త ధర తగ్గిస్తూ రైతుల వద్ద తక్కువకు కొంటున్నారు.
తూకాల్లో మోసాలు.. కనబడని ఎలక్ర్టానిక్ కాటాలు
తెలంగాణలోని భద్రాచలం, బంజర, అశ్వాపురం, మణుగూరు తదితర ప్రాంతాల వ్యాపారులు విలీన మండలాల్లో తిష్ట వేస్తూ పత్తి కొనుగోలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పత్తి కొనుగోళ్లకు ఎలక్ర్టానిక్ కాటాలు వినియోగించాలి. కానీ విలీన మండలాల్లో అవి మచ్చుకు కూడా కనిపించవు. కాటా రాళ్లతో తూకం వేస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. తేడా కాటాలతో క్వింటాకు 5 నుంచి 6 కిలోల వరకు కానరాకుండా మోసాలకు పాల్పడుతున్నారు. ఇదేకాక తారం అంటూ రెండు, మూడు కిలోల వరకు రైతుల వద్ద నుంచి కోత విధిస్తున్నారు. దీంతో అమాయక గిరిజన రైతులు దళారులు చెప్పిన ధరకే విక్రయిస్తూ నష్టపోతున్నారు. ప్రతీ సీజన్‌లో ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత అధికారు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.