పాపికొండల యాత్ర ఈసీజన్‌కు లేనట్టే

ABN , First Publish Date - 2020-08-01T11:08:26+05:30 IST

పాపికొండల టూరిజం ఈ సీజన్‌లోనూ లేనట్టే. గత ఏడాది సెప్టెంబర్‌లో కచ్చులూరు వద్ద గోదావరిలో పెద్ద ప్రమాదం ..

పాపికొండల యాత్ర ఈసీజన్‌కు లేనట్టే

బోట్లకు అనుమతి ఇవ్వని పోర్టు

దానికితోడు కరోనా దెబ్బ

ఇక వరదల సీజన్‌ మొదలు

15 నుంచి టూరిజం బోట్లు గ్రీన్‌సిగ్నల్‌

రాజమహేంద్రవరంలో బోటు షికార్‌

గత సెప్టెంబరు నుంచి నిలిచిన 75 బోట్లు, లాంచీలు

వందలాది మంది సిబ్బంది ఆకలి కేకలు

మూతపడిన టూరిజం ఏజెన్సీలు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): పాపికొండల టూరిజం ఈ సీజన్‌లోనూ లేనట్టే. గత ఏడాది సెప్టెంబర్‌లో కచ్చులూరు వద్ద గోదావరిలో పెద్ద ప్రమాదం జరిగి, ఎక్కుమంది  జలసమాధి అయిన సంగతి  తెలిసిందే. అప్పుడు ఆగిపోయిన బోట్లకు ఇప్పటికీ అనుమతి లేదు. కృష్ణా నదిలో ప్రమాదం జరిగిన వెంటనే అప్పటి తెలుగుదేశం  ప్రభుత్వం కొన్ని నిబంధనలతో జీవో తీసుకొచ్చింది. కచ్చులూరు ప్రమాదం తర్వాత వైసీపీ ప్రభుత్వం మరికొన్ని నిబంధనలు రూపొందించడంతోపాటు కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. బోట్లకు అనుమతి ఇచ్చే అధికారాన్ని పోర్టు అధికార్లకు అప్పగించింది. ప్రభుత్వం కంట్రోలు రూమ్‌లు గత నెలలో ప్రారంభించింది. అరకొరగా సిబ్బందిని కూడా పెట్టింది. కానీ పాపికొండలతోపాటు, అఖండగోదావరి, కోనసీమ గోదావరి పాయలలో కూడా బోటు షికార్‌ ప్రారంభం కాలేదు. కొత్త నిబంధనల ప్రకారం పోర్టు అధికారులు టూరిజం బోట్లు, ప్రైవేట్‌ బోట్లను తనిఖీచేసి నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాలి.


సుమారు 10 నెలలు కావస్తున్నా పోర్టు అధికారులు బోట్లను తనిఖీచేయలేదు. ఎవరికీ అనుమతీ ఇవ్వలేదు. రాజమహేంధ్రవరం, పోలవరం, పోచవరం తదితర ప్రాంతాల నుంచి పాపికొండలు తదితర ప్రాంతాలలో షికారు చేసే బోట్లు, లాంచీలు సుమారు 75వరకూ ఉన్నారు. బోట్లు రాజమహేంద్రవరంలో 24 ఉండగా, పోచవరంలో  35 ఉన్నా యి. మిగతావి లాంచీలు.. ఇతర బోట్లు. వీటిపై వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్కో బోటు మీద కనీసం 7 నుంచి 8 మంది స్టాఫ్‌ ఉంటారు. బోటు ఓనర్‌ ఎలానూ ఉంటారు. ప్రయాణికుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసే ఏజన్సీలు అనేకం ఉన్నాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టున  కచ్చు లూరు బోటు ప్రమాదానికి ముందు ఈ ఏజన్సీలు కళకళలాడుతూ ఉండేవి. బోట్లు ఆగిపోవడంతో ఏజన్సీలు క్రమంగా ఎత్తేస్తున్నారు. అద్దెలు చెల్లించలేక, స్టాఫ్‌ను మెయింటెనెన్స్‌ చేయలేక ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పటికే 5 ఏజన్సీల వరకూ మూతపడ్డాయి. పోర్టు అధికారులు కొంత ఆలస్యం చేయగా, ఇటీవల కరోనా వైరస్‌తో టూరిజానికి తీవ్ర నష్టం జరిగింది.


ఈనెల 15వ తేదీ నుంచి టూరిజం హోటళ్లు తెరుస్తామని,  బోట్లు తిప్పే ప్రయత్నం చేస్తామని టూరిజం శాఖ మంత్రి  శుక్రవారం ప్రకటించారు. కానీ పాపికొండల బోట్లు మాత్రం తిరిగే పరిస్థితి కనిపించడంలేదు. బహుశా నవంబరు, డిసెంబర్‌లలో పాపికొండట బోటు షికార్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా బోట్లు తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ బోట్ల మీద ఆధారపడి జీవిం చే వేలాది మంది జీవనోపాధికోల్పోయారు. బోట్లపై పనిచేసే సిబ్బంది మరో ఆధారం లేక ఆకలికేకలు వేస్తున్నారు. బోట్ల యజమానులు కూడా వారికి ఏవిధమైన జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కులేని వారయ్యారు. కొన్ని బోట్ల యజమానుల పరిస్థితీ అంతే. బోటు షికార్‌ ఉంటే రాజమహేంద్రవరంలో టూరిస్ట్‌ల ప్రభావం ఎక్కువ ఉండేటి. పాపికొండల యాత్ర కోసం వచ్చేటూరిస్ట్‌లు ఇక్కడ లాడ్జిలు, హోటళ్ళలో బస చేసేవారు.


ఏజన్సీల ద్వాకా టికెట్లు తీసుకునేవారు. భోజన, టిఫిన్‌ సెంటర్లు రద్దీగా ఉండేవి. టూరిస్ట్‌లను తీసుకుని వెళ్లే టాక్సీలకు కూడా డిమాండ్‌ ఉండేవి.  ఇలా అనేక రకాలుగా ఈ టూరిజం మీద ఆధారపడి అనేకమంది జీవించేవారు. వీరి బతుకులు ఇవాళ కుదేలయ్యాయి. ప్రస్తుతం హడావుడిగా పోర్టు అధికారులు బోట్లను తనిఖీచేసి అనుమతి ఇచ్చినా కూడా బోట్లు తిరిగే అవకాశం లేదు. ఇది వరదల సీజన్‌. గతంలో కూడా వరద సమయంలో హెచ్చరికను ఖాతరు చేయకుండా వెళ్లడం వల్లే పెద్ద ప్రమా దం జరిగింది. వరదలకు తోడు కరోనా భయం కూడా ఉంది. 


15 నుంచి రాజమహేంద్రవరంలో బోటు షికార్‌

ఆగస్టు 15 నుంచి రాజమహేంద్రవరం గోదావరిలో బోటు షికారును ప్రారంభించే అవకాశం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి బోటు షికారు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2020-08-01T11:08:26+05:30 IST