పలాస చిత్ర యూనిట్‌ సందడి

ABN , First Publish Date - 2020-03-13T09:17:57+05:30 IST

పలాస చిత్ర దర్శకుడు కరుణకుమార్‌, హీరో రక్షిత్‌, సంగీత దర్శకుడు, విలన్‌ క్యారక్టర్‌ పోషించిన రఘు కుంచె

పలాస చిత్ర యూనిట్‌ సందడి

గోదావరి సిటి, మార్చి 12: పలాస చిత్ర దర్శకుడు కరుణకుమార్‌, హీరో రక్షిత్‌, సంగీత దర్శకుడు, విలన్‌ క్యారక్టర్‌ పోషించిన రఘు కుంచె రాజమహేంద్రవరం కుమారి థియేటర్‌ ఉదయం ఆట మధ్యలో గురువారం ప్రేక్షకులను కలసి సందడి చేశారు. ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్షిత్‌ చిత్రంలో డైలాగ్‌లతోను, రఘు చిత్రంలో పాటను పాడి ప్రేక్షకులను అలరించారు. ఈసందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కరుణకుమార్‌ మాట్లాడుతూ ఒక కొత్త ప్రయోగంగా 90 శాతం నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. దిగ్విజయంగా 2వ వారం నడుస్తుందన్నారు.


రఘు మాట్లాడుతూ ఇదే రాజమహేంద్రవరంలో వీటీ కాలేజీలో చదువుకున్నానని, గాడాల సొంతూరని, ఇదే థియేటర్‌లో ఎన్నో సినిమాలు చూసిన తాను తన సినిమా చూడడం చాలా థ్రిలింగ్‌గా ఉందన్నారు. ఈ చిత్రంలో ఐదుగురు పల్లెగాయకులను పరిచయం చేశామని, వడిసలేరు బేబి కూడా ఈ చిత్రంలో పాడారని అన్నారు.


హీరో రక్షిత్‌ మాట్లాడుతూ ఈ చిత్రం పూర్తిగా శ్రీకాకుళం యాసలో తీశారని, షూటింగ్‌ అంతా పలాసలోనే జరిగిందన్నారు.  40 రోజులు ప్రాక్టీసుచేసి ఆయాసలో మాట్లాడానని అన్నారు. లండన్‌బాబు తన మొదటి చిత్రమని, థాంక్స్‌ గివింగ్‌ టూర్‌లో భాగంగా పలాస, వైజాగ్‌ వెళ్లామని, శుక్రవారం విజయవాడ వెళుతున్నామని అన్నారు. ఈ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-03-13T09:17:57+05:30 IST