-
-
Home » Andhra Pradesh » East Godavari » Owners of small scale enterprises that dont close
-
లాక్‌డౌన్ వీటికి లేదా..?
ABN , First Publish Date - 2020-04-07T10:13:09+05:30 IST
కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. కానీ ఈ

మూతపడని చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలు
రెడీమిక్స్, హలోబ్రిక్స్, ఫుట్‌పాత్ పలకల తయారీ కంపెనీల్లో కొనసాగుతున్న కార్యకలాపాలు
భౌతిక దూరం పాటించకుండానే కార్మికుల పనులు
ఆంధ్రజ్యోతి, కాకినాడ: కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. కానీ ఈ సూచనలు చాలామంది ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే జిల్లాలో కొన్ని పరిశ్రమలకు చీమకుట్టినట్టు కూడా లేదు. దీనికి చిన్నతరహా పరిశ్రమల యాజమాన్యాలు మొండి వైఖరే నిదర్శనం. వీరు లాక్‌డౌన్ పాటించడం లేదు. సామర్లకోట రూరల్ మండలం పరిధిలో వెంకటకృష్ణారాయపురం-ఉండూరు దారిలో ఫుట్‌పాత్ పలకలు తయారు చేసే కంపెనీ, ఆ పక్కనే రెడీమిక్స్ తయారు చేసే ఇండస్ర్టీ యథావిథిగా పనిచేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా కార్మికులను రప్పించి పని చేయిస్తున్నారు. ఈ రెండు ఇండస్ర్టీల్లో 20 మంది చొప్పున ఒడిశా, బీహార్ రాష్ర్టాల కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా భౌతిక దూరం పాటించకుండా పనిచేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల్లో ఒక బిహారీకి ఇటీవల మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయని సమాచారం. దీంతో అతడ్ని విధులకు రావద్దని యాజమాన్యం సూచించింది.
భారీ పరిశ్రమల్లో స్వచ్చంధంగానే...
జిల్లావ్యాప్తంగా ఆయా పారిశ్రామిక వాడల్లో ఉన్న భారీ పరిశ్రమల యాజమాన్యాలు తమ ఉత్పత్తులను స్వచ్ఛందంగా నిలిపివేశాయి. తమ కంపెనీల్లో పనిచేసే కార్మికులకు సగం వేతనం చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. కానీ హలో బ్రిక్స్, ఫుట్‌పాత్ పలకల తయారీ కంపెనీలు, కొన్ని చమురు శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు మాత్రం ఉత్పత్తులను ఆపలేదు. జిల్లాలో ఉన్న 24 భారీ పరిశ్రమల యాజమాన్యాలు స్వచ్ఛందంగా తమ కంపెనీలకు తాళం వేశాయి. లక్షల కోట్ల పెట్టుబడితో నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలకు నష్టం వచ్చినా జాతీయ విపత్తు ధోరణితో ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. కాకినాడ పారిశ్రామిక వాడలో జీఎంఆర్ ఆయిల్ రిఫైనరీ, పవర్ ప్లాంట్లతోపాటు రసాయన పరిశ్రమలున్నాయి. జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్, జీవీకే పవర్ లిమిటెడ్, జీవీకే ఇండస్ర్టీస్, రిలయన్స్ ఇండస్ర్టీస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కోనసీమలో కెయిర్న్ ఎనర్జీ ఇండియా ప్రై లిమిటెడ్, బిక్కవోలులో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, సామర్లకోటలో నవభారత్ వెంచర్స్, ఉప్పాడలో స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్ పవర్‌ప్లాంట్లు ఉత్పత్తులు నిలిపివేయడంవల్ల మిలియన్ కోట్లలో నష్టపోయాయి.
ఆంధ్రా పేపర్ మిల్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, తవుడునుంచి నూనె తీసే కర్మాగారాలు, జీడిపిక్కల ప్రొసెసింగ్ యూనిట్లు, సిరామిక్స్, పామాయిల్ ఫ్యాక్టరీలన్నీ షట్‌డౌన్‌లో ఉన్నాయి. రైస్‌మిల్లులు, కొబ్బరి నీళ్లు ప్రొసెసింగ్ యూనిట్, రబ్బరు ప్రొసెసింగ్ యూనిట్లు, ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్‌లు మూతపడ్డాయి. ఆక్వా, ఫార్మాసూటికల్, రైస్‌మిల్లులు, ప్రజలకు నిత్యావసర వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు తెరిచి ఉత్పత్తి ప్రారంభించడానికి సమాయత్తమయ్యాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా ఈ పరిశ్రమలు ఎందుకు తెరుస్తున్నారని పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరింది. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు, కంపెనీలు, కర్మాగారాల్లో ఉన్న కేటగిరీలనుబట్టి 24 రకాల పరిశ్రమలను అంటే ప్రజలకు వివిధ రూపాల్లో నిత్యావసర సామాగ్రి, వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలను తెరవవచ్చని ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. దీంతో అత్యవసర అవసరాల రీత్యా సదరు పరిశ్రమలు తెరుచుకుంటున్నాయన్నారు. వీటికి కలెక్టర్ ఆధ్వర్యంలో పునరుద్ధరణకు అనుమతి జారీ చేస్తున్నారన్నారు.