-
-
Home » Andhra Pradesh » East Godavari » over talking
-
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం: ద్వారంపూడి
ABN , First Publish Date - 2020-12-28T05:56:30+05:30 IST
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, త్వరలో కొండబాబు అవినీతి, అక్రమాలు బయట పెడతామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), డిసెంబరు 27: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, త్వరలో కొండబాబు అవినీతి, అక్రమాలు బయట పెడతామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీకి రావడం తమ అదృష్టమన్నారు. ఏటిమొగ వద్ద 45 ఎకరాలకు రూ.12 కోట్లు ఫీజు చెల్లించకుండా కొండబాబు భూ వినియోగ మార్పిడి చేయించుకున్నారన్నారు. స్వచ్ఛంధంగా రద్దు చేయించుకుని ప్రస్తుతం తగ్గిన ఫీజు ప్రకారం రూ.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. లేనిపక్షంలో త్వరలోనే భూ వినియోగ మార్పిడిని రద్దు చేయించి విచారణ జరిపిస్తామన్నారు. జగన్నాథపురం మూడో వంతెన ప్రజల కోసం కాదని, ఆయన సొంత లాభం కోసమేనని అన్నారు. పోర్టు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే వనమాడి అనుచరులు కోర్టుకు వెళ్లారన్నారు. వలసపాకల, వాకలపూడి సమీపంలో కొమరగిరిలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని, చొల్లంగి, పటవలలో కూడా ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. మొదటి విడతలో రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాకినాడకు ఎప్పుడూ సునామీ రాలేదని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. నెహ్రూ విగ్రహం తొలగింపు ప్రైవేటు వ్యవహారమని, విగ్రహాన్ని రాజాట్యాంక్ పార్కులో ఉంచడం జరిగిందని ద్వారంపూడి స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు, చైర్మన్‌లు, నాయకులు పాల్గొన్నారు.