’ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కరోనాను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గం..’
ABN , First Publish Date - 2020-06-25T19:53:53+05:30 IST
కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని జిల్లా కలెక్టర్ డీ మురళీధరరెడ్డి తెలిపారు. బొమ్మూరులోని టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను

వైరస్ విపత్తును ఎదుర్కొనడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాం!
రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం కొవిడ్ కేస్ సెంటర్లలో 6 వేల బెడ్లు సిద్ధం
గర్భిణులకు కొవిడ్ టెస్ట్ సర్టిఫికెట్లు జారీ
ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే ఫలితం: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
ధవళేశ్వరం(తూర్పు గోదావరి జిల్లా): కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని జిల్లా కలెక్టర్ డీ మురళీధరరెడ్డి తెలిపారు. బొమ్మూరులోని టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డివిజన్లలో 6 వేల బెడ్లతో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సెంటర్లలో పాజిటివ్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించే విధంగా వైద్యసిబ్బందితోపాటు డిజిటల్ ఎక్స్-రే యూని ట్లు, ఆక్సీమీటరు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో మూడు వేల బెడ్లు, కాకినాడ, అమలాపురం డివిజన్లలో 1500 బెడ్లు చొప్పున ఆరు వేల బెడ్లు సిద్ధం అవుతున్నాయన్నారు.
పాజిటివ్ రోగులకు అత్యవసర చికిత్స, అవసరమైతే పది నిమిషాల వ్యవధిలోనే కొవిడ్ ఆస్పత్రులకు తరలించే విధంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్ల కోఆర్డినేటర్‌గా జేసీ రాజకుమారి వ్యవహరిస్తారని తెలిపారు. అత్యవసర సమయంలో గర్భిణులకు కరోనా నిర్థారణ కాకుండా చికిత్స అందించడానికి ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని, అందువల్ల నెల లు నిండిన ప్రతీ గర్భిణికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. జిల్లాలో 585 యాక్టివ్ కేసులు ఉండగా, 55 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఫలితం ఉంటుందని, ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తతో మెలగాలని సూచించారు. ఆయన వెంట జేసీలు కీర్తి సురేష్, రాజకుమారి, ట్రైనీ కలెక్టర్ అపరాజితసిన్‌సిన్వర్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, అర్బన్ ఎస్పీ షిమూషిబాజ్‌పాయ్, అమలాపురం ఆర్డీవో భవానీశంకర్, జిల్లా కోఆర్డినేటర్ రమేష్‌కిషోర్, రూరల్ ఎంపీడీవో సుభాషిణి, తహశీల్దారు రియాజ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.