ఇక ఆఫ్‌లైన్లో విక్రయాలు

ABN , First Publish Date - 2020-11-06T06:02:27+05:30 IST

ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ విధానంలో ప్రధానంగా వినియోగదారులే ఆయా రీచలకు వెళ్లి ఇసుక కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది.

ఇక ఆఫ్‌లైన్లో విక్రయాలు

  • వినియోగదారులు నేరుగా ఇసుక రీచ్‌ల్లో కొనుగోలు చేసుకునే వీలు
  • పట్టా భూముల్లో తవ్వకాల అనుమతులు రద్దు

అమలాపురం (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ విధానంలో ప్రధానంగా వినియోగదారులే ఆయా రీచలకు వెళ్లి ఇసుక కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనిలో భాగంగా జిల్లాలో 30కుపైగా ఉన్న ఇసుక రీచల నుంచి నేరుగా వినియోగదారు లకు సరఫరా చేస్తారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుకను విక్రయించడంతోపాటు ఆఫ్‌లైనలో ఇసుక బుక్‌ చేసు కోవచ్చు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పట్టా భూముల  పేరిట కొందరు వ్యక్తులు అక్రమ విధానంలో కొన్ని రీచలు నిర్వహిస్తున్నారు. ఈ తరహాలో పి.గన్నవరం నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పట్టా భూముల్లో ఇసుక సేకరణ పేరిట భారీగానే దందాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలకనుంది. అయితే డ్రెడ్జింగ్‌ల ద్వారా ఇసుక తవ్వకాలను భారీగా చేపట్టనున్నారు. ప్రస్తుతం జిల్లాలో రావులపాలెం, బోడసకుర్రులలో ఉన్న ఇసుక డంపింగ్‌ యార్డుల ద్వారా రవాణా జరుగుతోంది. ఐదు యూనిట్ల ఇసుక లారీ ధర రూ.25 వేల పైనే పలుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా వినియోగదారులే ఆయా రీచలకు వెళ్లి ఇసుక కొనుగోలు చేసుకునేలా తీసుకున్న నిర్ణయం ఎలా కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

Updated Date - 2020-11-06T06:02:27+05:30 IST