నర్సరీల నష్టంపై నివేదిక తయారు చేయండి

ABN , First Publish Date - 2020-10-21T06:02:21+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నర్సరీరంగానికి జరిగిన నష్టంపై వెంటనే నివేదికను తయారు చేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.

నర్సరీల నష్టంపై నివేదిక తయారు చేయండి
తహశీల్దారు కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ అనుపమఅంజలి

  •  సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి
  • కడియం మండలంలో నీట మునిగిన నర్సరీల పరిశీలన

కడియం, అక్టోబరు 20: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నర్సరీరంగానికి జరిగిన నష్టంపై వెంటనే నివేదికను తయారు చేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. వేమగిరి, వీరవరం, కడియపులంక గ్రామాల పరిధిలో నీటమునిగిన నర్సరీలను ఆమె మంగళవారం పరిశీలించారు. ముందుగా తహశీల్దారు కార్యాలయంలో అధికారులు, నర్సరీరైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. నర్సరీల వెంబడి ఉన్న రహదారులకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు నిల్వఉండి నర్సరీలు నీట మునిగాయని రైతులు వివరించారు. దీంతో నర్సరీలకు జరిగిన నష్టంతోపాటు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తహశీల్దారు భీమారావుకు సబ్‌కలెక్టర్‌ ఆదేశాలు చేశారు.

  • నర్సరీ రైతులను ఆదుకుంటాం: ఆకుల వీర్రాజు

తుఫాన్‌ కారణంగా నష్టపోయిన నర్సరీ రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వైసీపీ రూరల్‌ సమన్వయకర్త ఆకుల వీర్రాజు తెలిపారు. నీటమునిగిన నర్సరీలను పరిశీలించడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో నీరు బయటకుపోయే మార్గం లేక ముంపు సమస్య తలెత్తిందని, దీనికి శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలపై అధికారులతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. కాగా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో 8,500 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 1200 హెక్టార్లలో నర్సరీలున్నాయని ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌ తెలిపారు. వర్షం నీరు తగ్గాక నర్సరీ మొక్కల పరిరక్షణ కోసం వైఎస్సార్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయం సహాయంతో నర్సరీ రైతులకు వెబ్‌నార్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నర్సరీ సంఘం అధ్యక్షుడు పుల్లా సత్యనారాయణ(చంటి), ఉపాధ్యక్షుడు కొత్తపల్లి శివాజీ, ఆకుల బాపిరాజు, తాడాల చక్రవర్తి, ఈలి బేబి, తాడాల సత్యనారాయణ, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌, ఉద్యానశాఖ అధికారి డి.సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T06:02:21+05:30 IST