లేదు బాస్! జోరు తగ్గిన జోష్
ABN , First Publish Date - 2020-12-30T07:15:26+05:30 IST
డిసెంబర్ 31 అంటే ప్రతి ఒక్కరిలో అదో ఆనందం

జిల్లాలో న్యూఇయర్ వేడుకలపై కొవిడ్ ప్రభావం
డిసెంబర్ 31 దగ్గరపడుతున్నా ఎక్కడా కానరాని సందడి
స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలు, ప్రత్యేక వినోదాల ఈవెంట్ల ఊసే లేదు
కొవిడ్ ముప్పు భయంతో ఎక్కడికక్కడే హోటళ్లు, రెస్టారెంట్లు ఈవెంట్లకు వెనుకంజ
గతేడాది ఈపాటికే డీజే బృందాలు.. సాంస్కృతిక కార్యక్రమాలకు బుకింగ్‌లే బుకింగులు
లక్షలు ఖర్చుచేసి ఈవెంట్లు నిర్వహించినా ఎవరూ రారనే భయంతో వెనుకంజ
బేకరీలకు కేకుల ఆర్డర్లూ అంతంతే
గతేడాది ఈపాటికి వందల కేజీల కేకులకు ఆర్డర్లు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
డిసెంబర్ 31 అంటే ప్రతి ఒక్కరిలో అదో ఆనందం. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ చిన్నాపెద్దా దగ్గర నుంచి యువతీయువకుల వరకు ఆరోజు చేసే సందడి అంతా ఇంతా కాదు. వీరి ఆనం దాన్ని రెట్టింపు చేయడానికి ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ సంస్థలు విందులు, వినోదాలు భారీగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి కొవిడ్ ప్రభావంతో కొత్త సంవత్సర వేడుకల కళ పూర్తిగా తప్పిపోయింది. ఎక్కడా న్యూఇయర్ వేడుకల సందడి కనిపించడం లేదు. వాస్తవానికి ఏటా ఈ సమయానికి కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, తుని తదితర పట్టణా ల్లో స్టార్ హోటళ్ల దగ్గర నుంచి ఓ మోస్తరు రెస్టారెంట్ల వరకు రకరకాల విందులు, వినోదాలు ఏర్పాటు చేసేవి. డీజే బృందాలతోపాటు హైదరాబాద్ నుంచి సినీనటులను తీసుకువచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవి. మందుబాబులకు అన్‌లిమిటెడ్ మద్యం ఆఫర్లు.. భోజన ప్రియులకు రకరకాల మాంసాహార వంటకాలతో ఆఫర్లు ప్రకటించేవి. ఈపాటికే కళ్లు చెదిరే ప్యాకేజీలతో టిక్కెట్లు కొనుగోలుకు కౌంటర్లు తెరిచేవి. కానీ ఈసారి అవన్నీ పోయాయి. ఎక్కడా ఇటువంటి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. కొవిడ్ మహమ్మారి ఈ ఏడాది మార్చి నుంచి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. లక్షకుపైగా కేసుల నమోదవడంతో జనం ఎక్కడికక్కడ భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ కొవిడ్ ముప్పు తగ్గలేదు. అయితే కేసుల సంఖ్య కొంత తగ్గిందని అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్ పేరుతో మరోసారి మహమ్మారి విజృంభిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ ప్రభావం రాబోయే కొత్త సంవత్సరం 2021 పైనా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో కొత్త సంవత్సర వేడుకల జోష్ ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి కాకినాడలో జీఆర్‌టీ, సరోవర్‌పోర్టికో, రాయల్‌పార్క్, సిటీ ఇన్, జయరెసిడెన్సీ, రాజమహేంద్రవరంలో షెల్టాన్, ఆనంద్ రీజెన్సీ, రివర్‌బే, లాహాస్పిన్, జెట్టీగ్రాండ్ తదితర హోటళ్లు, టూరిజం కార్పొరేషన్ పరిధిలో రిసార్టులు, అనేక ఫంక్షన్లు హాళ్లు ఏటా డిసెంబర్ 31 వేడుకల కోసం ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటు చేసేవి. ఒక్కో స్టార్ హోటల్ విందు, వినోదాల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చుచేసి ఈవెంట్లు నిర్వహించేవి. చిన్నహోటళ్లు రూ.2 లక్షల వరకు పెట్టుబడితో వేడుకలకు ఏర్పాట్లు చేసేవి. కానీ ఈసారి ఇవేవీ ఆ జోలికి వెళ్లలేదు. ఏ హోటల్ చూసినా కొత్త సంవత్సర వేడుకల జోష్ లేకుండా కళావిహీనంగా ఉన్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఈవెంట్లు నిర్వహిస్తే కేసుల భయం, అటు సాహసం చేసినా జనం వస్తారా?రారా? అనే సందేహాలతో ఆ జోలికి వెళ్లలేదని కాకినాడ జీఆర్టీ హోటల్ మేనేజర్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కొవిడ్ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలకు ఈవెంట్లు ఏర్పాటు చేసినా నష్టాలు తప్పవని, అందుకే ఆ జోలికి వెళ్లలేదని రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్ మేనేజర్ నిర్వేదం వ్యక్తం చేశారు.
బేర్‌మంటున్న రెస్టారెంట్లు.. బేకరీలు..
కొత్త సంవత్సర వేడుకలంటే చాలు రెస్టారెంట్లు రకరకాల ఫుడ్ ప్యాకేజీలను ప్రకటిస్తాయి. బిర్యానీ ఆఫర్ల కింద ఒకటి కొంటే మరో ప్యాకెట్ ఫ్రీ.. అన్‌లిమిటెడ్ బఫే వంటి ఆఫర్లు ఇస్తాయి. ఈసారి కొవిడ్‌తో ఇవి కూడా ఫుడ్ ప్యాకేజీల జోలికి వెళ్లలేదు. యాథావిథిగా హోటళ్లు తెరుస్తాంగానీ ఫుడ్ ప్యాకేజీలేవీ పెట్టే ఉద్దేశం లేదని ఓ హోటల్ యజమాని వివరించా రు. లక్షలు వెచ్చించి ఫుడ్ తయారుచేసినా కొనుగోళ్లు లేకపోతే నష్టపోతామని, ఈసారి ఆ సాహసం చేయలేమని చెబుతున్నాయి. కాకినాడ, రాజమహేద్రవరం, అమలాపురంతోపాటు ఇతర పట్టణాల్లో వేలాది రెస్టారెంట్లున్నాయి. ఇవన్నీ ప్రత్యేక ప్యాకేజీలు ఈపాటికే ఫ్లెక్సీల్లో ప్రదర్శించేవి. కానీ ఈ దఫా కొత్త సంవత్సర వేడుకలకు ఇవన్నీ కళ తప్పాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోని చిన్నాపెద్ద బేకరీలకు ఏటా ఈ సమయానికే 200 నుంచి 350 కేజీల వరకు రకరకాల న్యూఇయర్ కేకులకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది అడ్వాన్స్‌లు ఇచ్చి వెళ్లేవారు. కానీ ఈసారి ఎక్కడా పెద్దగా కేకుల ఆర్డర్లే లేవు. కాకినాడలో ఓ బేకరీ గతేడాది న్యూఇయర్ వేడుకలకు నాలుగు రోజుల ముందు 300 కేజీల కేకుల ఆర్డరు తీసుకుంది. కానీ ఇప్పుడు పది కేజీల కేకులకు ఆర్డరు కూడా రాలేదని ఆ యజమాని వివరించారు. అంతేకాదు కొత్తసంవత్సరం రోజు చాలామంది కొత్తగా బంగారు ఆభరణాలు, గాడ్జెట్స్, వస్త్రాలు ధరించడం ఆనవాయితీ. కానీ కొవిడ్‌తో ఆదాయాలు తారుమారుకావడంతో దీనిపైనా కొంత ప్రభావం పడింది.