నూతన రేషన్ విధానాన్ని స్వాగతిస్తాం
ABN , First Publish Date - 2020-12-20T06:24:20+05:30 IST
ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానాన్ని స్వాగతిస్తామని చౌకడిపో డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు పేర్కొన్నారు.

అమలాపురం టౌన్, డిసెంబరు 19: ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానాన్ని స్వాగతిస్తామని చౌకడిపో డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు పేర్కొన్నారు. గత ఆరు దశాబ్దాలుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎన్ని ఒడి దుడుకులు వచ్చినా, మార్పులు వచ్చినా వాటిని స్వాగతిస్తూనే ముందుకు సాగామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29వేల మంది డీలర్లతో పాటు సుమారు 60వేల కుటుంబాలు ఈవ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. అమలాపురం ముస్లిం షాదిఖానా భవనంలో శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన డివిజన్‌స్థాయి రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దశాబ్దాల కాలంగా పని చేస్తున్న డీలర్లకు ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. డీలర్లకు చట్టప్రకారం దశలవారీగా ఆదా యాన్ని పెంచాలని ముందస్తుగా డీలర్ల సంఘ ప్రతినిధు లతో చర్చించిన తరువాత నూతన విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కరోనాతో సుమారు 50మంది డీలర్లు చనిపోయారని, డీలర్లను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి రూ.50లక్షలు చొప్పున బీమా అందించాలని డిమాండ్ చేశారు. కరోనా బారినపడి ఎందరో డీలర్లు లక్షలాది రూపా యలు నష్టపోయారని, వారందరికీ ఆ నిధులను ప్రభుత్వమే రీయం బర్స్‌మెంట్ చేయాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మేటి ఏడుకొండలు, జిల్లా అధ్యక్షుడు నంది పాటి పల్లయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమాగౌరి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హేమలత, రాష్ట్ర కోశాధికారి రాజులపాటి గంగాధర్‌గౌడ్, కోట ఆంజనేయులు పాల్గొన్నారు.