మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తులుపై బోస్‌ మరోసారి ఫైర్!

ABN , First Publish Date - 2020-11-26T06:17:48+05:30 IST

రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీలో ముసలం..

మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తులుపై బోస్‌ మరోసారి ఫైర్!

తీర్పు ఆయనే ఇచ్చేసుకోవచ్చుగా!


(కాకినాడ, ఆంధ్రజ్యోతి): రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీలో ముసలం ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అయిన తోట త్రిమూర్తులుపై ఎంపీ బోస్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. శిరోముండనం కేసు విషయంలో తోట తన పలుకుబడిని ఉపయోగించి 23ఏళ్లుగా కేసు నుంచి తప్పించుకుంటున్నారని, పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ను మార్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని రాష్ట్ర హోంమంత్రికి ఇటీవల లేఖ రాసిన బోస్‌ తాజాగా మరోసారి స్పందించారు.


అమరావతిలో బుధవారం సీఎం జగన్‌ వద్ద డీఆర్సీ పంచాయితీ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన బోస్‌... త్రిమూర్తులుపై మండిపడ్డారు. శిరోముండనం కేసుపై తాను 22ఏళ్ల నుంచీ పోరాటం చేస్తున్నానన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రెండువైపులా లాయర్లను త్రిమూర్తులే పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ విధంగా చేసే బదులు ఆయనే తీర్పు కూడా ఇచ్చేసుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో బోస్‌, త్రిమూర్తులు మధ్య యుద్ధం మరింత ముదిరినట్లయ్యింది. కాగా శిరోముండనం అంశం జగన్‌ వద్ద ప్రస్తావనకు రాలేదని బోస్‌ చెప్పారు.


Updated Date - 2020-11-26T06:17:48+05:30 IST