సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం: మంత్రి కన్నబాబు
ABN , First Publish Date - 2020-10-03T07:40:25+05:30 IST
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తో సీఎం జగన్ అమల్లోకి తీసుకొచ్చారని మంత్రి

సర్పవరం జంక్షన్, అక్టోబరు 2: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తో సీఎం జగన్ అమల్లోకి తీసుకొచ్చారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం రమణయ్యపేట కాలువ గట్టు వద్ద గల సామాజిక భవనంలో ఎంపీడీవో పి.నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా జీ వించవచ్చన్నారు.
సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. డీపీవో నాగేశ్వరనాయక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తడి, పొడి చెత్త సేకరణను మహోద్యమంలా చేపడుతున్నా మన్నారు. ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం స్వచ్ఛందం గా రోజుకు రూ.2 చెల్లించి గ్రామీణ ప్రాంతాలు మరింత శుభ్రంగా ఉండేలా తోడ్పాటు అందించాలని కోరారు. సచివాలయ సిబ్బందికి జ్ఞాపికలు మంత్రి అందించారు. తహశీల్దారు వి.మురళీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ఎన్. వెంకటరెడ్డి, వైసీపీ నేతలు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), లింగం రవి, విత్తనాల రమణ తదితరులు పాల్గొన్నారు.