కాశీ యాత్రికులకు వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-23T08:53:51+05:30 IST

కాశీయాత్ర చేసి కరప చేరుకున్న పలువురు గ్రామస్థులకు ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. మూడు బ్యాచ్‌లుగా సుమారు

కాశీ యాత్రికులకు వైద్య పరీక్షలు

కరప/సామర్లకోట, మార్చి 22: కాశీయాత్ర చేసి కరప చేరుకున్న పలువురు గ్రామస్థులకు ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. మూడు బ్యాచ్‌లుగా సుమారు 80 మంది ఈ నెల 13న కాశీయాత్రకు వెళ్లారు. వారంతా ఆదివారం ఉదయం సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరి రాకపై ముందే సమాచారం అందుకున్న అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తగిన ఆదేశాలు జారీచేశారు. మంత్రి కన్నబాబు ఆదేశాలతో ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఏర్పాటుచేసి వారిలో కొందరిని కరప పీహెచ్‌సీకి తరలించారు. మరికొందరు కార్లు, ఆటోల్లో బయలుదేరినట్టు తెలిసి కరప ఎస్‌ఐ దానేటి రామారావు సిబ్బందితో వెళ్లి వారిని పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అప్పటికే ప్రత్యేక ఏర్పాట్లుచేసిన మండల వైద్యాధికారి రమావత్‌ శ్రీనివాసనాయక్‌ 63 మంది యాత్రికులకు పలు పరీక్షలు నిర్వహించారు.


14 రోజులపాటు ఇంట్లోని ప్రత్యేక గదికి పరిమితం కావాలని చెప్పారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర ఏ సమస్య ఉత్పన్నమైనా తమకు వెంటనే సమాచారం అందివ్వాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు ఇళ్లు విడిచి బయటకు రావద్దని కోరారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ప్రతీరోజు ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. వేళంగి పీహెచ్‌సీ వైద్యుడు ఎం.వీరయ్య, హౌస్‌సర్జన్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. 


ఇప్పటివరకు 21 మంది విదేశాల నుంచి రాక

కరప, వేళంగి పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాలకు ఇప్పటివరకు 21మంది విదేశాల నుంచి వచ్చినట్టు వైద్యాధికారులు రమావత్‌ శ్రీనివాసనాయక్‌, ఎం.వీరయ్యలు తెలిపారు. కరప పీహెచ్‌సీ పరిధిలోని గొడ్డటిపాలెం, అరట్లకట్ట, కరప, ఉప్పలంక, గురజనాపల్లి, నడకుదురు, జడ్‌.బావారం గ్రామాలకు పదిమంది ఆయా దేశాల నుంచి వచ్చినట్టు శ్రీనివాసనాయక్‌ చెప్పారు. వేళంగి పీహెచ్‌సీ పరిధిలోని పెద్దాపురప్పాడు, యండమూరు, చినకొత్తూరు, వేళంగి, వేములవాడ, జి.బావారం గ్రామాలకు చెందిన 11మంది కువైట్‌, బెహరాన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి వచ్చినట్టు వైద్యాధికారి ఎం.వీరయ్య తెలిపారు.


వారందరికీ పరీక్షలు నిర్వహించామని, అయితే వారిలో ఎవరూ అనుమానితులు లేరని స్పష్టంచేశారు. ఇంగ్లాండ్‌ నుంచి పెద్దాపురప్పాడు వచ్చిన అనుమానితుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకవార్డులో ఉంచి పరీక్షించగా అతడికి ఎటువంటి లక్షణాలు లేనట్టు నిర్ధారణయ్యిందన్నారు. మొత్తం 21మందిని గృహనిర్బంధంలో ఉంచామని, మూడు పూటల వారి ఇళ్ల ల్లోను, పరిసరాల్లోను సోడియం హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌ను పిచికారీ చేయిస్తున్నామన్నారు. వైద్యసిబ్బంది వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-03-23T08:53:51+05:30 IST