పెళ్లి..(సందడి లేకుండా)

ABN , First Publish Date - 2020-05-10T09:14:00+05:30 IST

వివాహాది శుభ ముహూర్తాలు ముగియనుండడంతో పెళ్లిళ్లకు వందలాది జంటలు సిద్ధమవుతున్నాయి.

పెళ్లి..(సందడి లేకుండా)

పెద్ద సంఖ్యలో జరగనున్న వివాహాలు

మరోపక్క పెళ్లిళ్లపై కరోనా ఆంక్షలు

 500కు పైగా వివాహాలకు అనుమతులు

 ఇక దగ్గరి చుట్టాలతోనే హడావుడి తంతు 

నెలాఖరుతో ముగుస్తున్న ముహూర్తాలు


(ఆంధ్రజ్యోతి-అమలాపురం): వివాహాది శుభ ముహూర్తాలు ముగియనుండడంతో పెళ్లిళ్లకు వందలాది జంటలు సిద్ధమవుతున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా మార్చి నుంచి ముహూర్తాలు వాయిదా వేస్తున్నప్పటికీ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో ఈ నెలాఖరులోగా పెళ్లిళ్లు చేసేందుకు ముహూర్తాలను ఖరారు చేస్తున్నారు. అధికారికంగా కొం దరు పెళ్లికి అనుమతి తీసుకుంటుండగా మరికొందరు మొక్కుబడిగానే ఆయా గ్రామాల్లో పెద్దలు, స్థానిక అధి కారుల సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా వివాహా లు చేసుకుంటున్నారు.


సాధారణంగా మార్చి నుంచి మే వరకు మంచి శుభలగ్నాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. మార్చికి మూడు నెలల ముందు నుంచే కల్యాణ మండపాలు, పూల మండపాలు, కేటరింగ్‌ వంటివి బుక్‌ చేసుకు న్నారు. అయితే మార్చి 22 నుంచి కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో కొద్దిరోజులే కదా అని కొందరు ముహూర్తాలు సైతం వాయిదా వేసుకుని ఆర్భాటంగా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పటికే 50 రోజు లుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ముహూర్తాల గడువు మే నాటికి ముగియనున్నాయి. దాంతో గతంలో వివాహాలు వాయిదా వేసుకున్నవారు సైతం మేలో ఉన్న మంచి ముహూర్తాలకు కరోనా నిబంధనల పాటిస్తూనే పెళ్లిళ్లు చేసేందుకు శ్రీమంతులు సైతం ముందుకు వచ్చారు. మే నెలలో 10, 12, 13, 14, 15, 23, 24 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో భారీ సంఖ్యలోనే పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల మేరకు తక్కువ సంఖ్యలో అతిథులు, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పెళ్లిళ్లు చేసుకు నేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


కోనసీమ అంతటా 500కు పైగా పెళ్లిళ్లకు ఆర్డీవో కార్యాలయ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇక మే 30 నుంచి జూన్‌ 8 వరకు శుక్రమౌఢ్యం కారణంగా పెళ్లిళ్లకు ఆస్కారం లేదు. ఆ తరువాత జూలై 21 నుంచి ఆగస్టు 19 వరకు శ్రావణమాసంలో ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పదిహేను రోజులపాటు వరుసగా వివాహాలు జరగనున్నాయి. శ్రావణమాసంలో ఆగస్టు 13న చివరి ముహూర్తం. ఆ తరువాత వచ్చే రోజుల్లో ముహూర్తాలు అంతగా లేకపోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ నెలలో ఉన్న ముహూర్తాలనే ఖరారు చేసుకుని వధూ వరులకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక సమస్యలున్న వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం ఒక వెసులుబాటు. పరిమిత వ్యయంతో వేడుకను పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. ఆర్భాటంగా, తమ హోదాకు తగ్గట్టు పెళ్లిళ్లు చేయాలనుకున్న వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితే. రెవెన్యూ అధికారులు పెళ్లిళ్లకు ఆంక్షలతో కూడిన అనుమతి పత్రాలను జారీ చేస్తూ నిఘా సైతం పెడుతున్నారు. దాంతో ఉల్లంఘనలు లేకుండా వధూ వరుల తల్లిదండ్రులూ జాగ్రత్త పడుతున్నారు.

Updated Date - 2020-05-10T09:14:00+05:30 IST