నెల్లూరు టు ఒడిసా
ABN , First Publish Date - 2020-12-29T06:28:31+05:30 IST
నెల్లూరుకు చెందిన ఇద్దరు బాలికలను మాయమాటలతో మోసగించి ఒక యువకుడు ఒడిసాకు తీసుకుపోతుండగా రాజమహేంద్రవరం నేర విభాగం పోలీసులు పట్టుకున్నారు.
- బాలికలకు మాయమాటలు చెప్పి తీసుకెళ్తున్న యువకుడిని పట్టుకున్న పోలీసులు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 28: నెల్లూరుకు చెందిన ఇద్దరు బాలికలను మాయమాటలతో మోసగించి ఒక యువకుడు ఒడిసాకు తీసుకుపోతుండగా రాజమహేంద్రవరం నేర విభాగం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో సోమవారం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం క్రైం ఎస్‌ఐ కట్టా శ్రీనివాసరావు, హెచ్‌సీలు అబ్బులు, ఉదయభాస్కర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు స్కానర్ హ్యాండ్ మిషన్‌తో అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సు దిగి బయటకు వస్తున్న ఇద్దరు బాలికలు, యువకుడిని చూసి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నెల్లూరులో స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న బాలికలకు అదే మిల్లులో పని చేస్తున్న ఒడిసా కందియాసాహి పోలసార గ్రామానికి చెందిన కులమణిసాహుతో పరిచయం ఏర్పడింది. అయితే పనికి తీసుకెళ్తున్నానని చెప్పి వారిని తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. దొంగలు, నేరగాళ్లను గుర్తించేందుకు వేలిముద్రల స్కానర్‌తో తనిఖీ చేయడం వల్లే బాలికలను పోలీసులు రక్షించగలిగారు. వారితో పాటు కులమణిని క్రైం పోలీసులు ప్రకాష్‌నగర్ పోలీసులకు అప్పగించారు. వారు వెంటనే బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.